కలం, వెబ్డెస్క్: న్యూయార్క్ (New York)లోని ఎంపైర్ స్టేట్ బిల్డిండ్ (Empire State Building) పై చోటు చేసుకున్న ఓ అనూహ్య ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. ఓ జంట బిల్డింగ్ పై భాగానికి చేరుకొని ఓ బ్యానర్ ప్రదర్శించారు. అంతే కాకుండా యువకుడు తన ప్రియురాలికి మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేసి ఇద్దరూ ముద్దు కూడా పెట్టుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. న్యూయార్క్ పోలీసులు రంగంలోకి దిగి ఈ ప్రేమ జంటను అరెస్ట్ చేశారు. వీరిని ఏంజెలీనా నికోలావ్, ఇవాన్ కుజ్నెత్సోవ్లుగా గుర్తించారు.
ఇద్దరూ నలుపు రంగు దుస్తులు, మాస్కులు ధరించి బిల్డింగ్పై నానా హంగామా సృష్టించారు. సుమారు 1500 ఎత్తులో నిలబడి ఓ బ్యానర్ ప్రదర్శించారు. అందులో అధికారంపై ఉన్న ప్రేమను అధిగమించి.. ప్రేమ శక్తిని గెలిచినప్పుడు ప్రపంచానికి శాంతి లభిస్తుందని రాసుకున్నారు. ఇవాన్ అక్కడే తన ప్రియురాలు ఏంజెలీనాకు మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఇద్దరూ కౌగిలించుకొని ముద్దు కూడా పెట్టుకున్నారు. అనంతరం వారు కిందకు రాగానే న్యూయార్క్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
1250 అడుగుల ఎత్తున్న ఈ స్కై స్క్రాపర్ పై భాగంలో ఉన్న 200 అడుగుల పొడవైన స్పైర్ పైకి వారు ఎలా ఎక్కారన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ప్రస్తుతం వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన వల్ల పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఫిఫా మ్యాచ్లు, పలు వేడుకల రద్దీతో పాటు తీవ్ర ఎండలు ఉన్న నేపథ్యంలో నగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

