కలం, ఖమ్మం బ్యూరో : ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని కాపాడడమే మనం భావితరాలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పద్మశ్రీ వనజీవి రామయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే, వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పద్మశ్రీ వనజీవి రామయ్య తన జీవితాన్ని ప్రకృతి పరిరక్షణకే అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటారని, ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చెట్లు పెరిగితేనే స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా వర్షాలు కురిసి పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, అందుకే ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కనైనా నాటి కంటికి రెప్పలా కాపాడాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతలను అలవర్చుకొని పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

