Mobile Popup Ad
Mobile Popup Ad

బాధితులకు అండగా నిలవాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో : మహిళలు, చిన్నారులపై హింస, వేధింపులకు గురైన బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector Chitra Mishra) అన్నారు. బాధితులకు భద్రత కల్పించడంతో పాటు మానసిక స్థైర్యాన్ని అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లిలోని భరోసా సెంటర్‌లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధ్యక్షతన బుధవారం రాత్రి నిర్వహించిన కన్వర్జెన్స్ (సమన్వయ) సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహిళలు, చిన్నారుల రక్షణ, పునరావాసం, న్యాయ సహాయం, బాధితులకు అందించాల్సిన సేవలపై వివిధ శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవ సంస్థ ప్రతినిధులు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, విద్యాశాఖ, సఖి సెంటర్ నిర్వాహకులు, లేబర్ ఆఫీసర్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే హింస, లైంగిక వేధింపులు, దాడులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ సహాయం అందించాలని సూచించారు. బాధితులకు ఉచిత కౌన్సెలింగ్, మానసిక ధైర్యం కల్పించడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సను వేగంగా అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అలాగే ఉచిత న్యాయ సహాయం అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

సమావేశంలో పోక్సో (POCSO) కేసుల దర్యాప్తు పురోగతి, షీ టీమ్స్ పనితీరు, సఖి సెంటర్ నిర్వహణ, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం అమలు, బాలల రక్షణ చర్యలు, బాధితుల పునరావాసం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

సఖి సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్, సీపీ

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని సఖి (వన్ స్టాప్) సెంటర్ ను సందర్శించారు. కేంద్రం నిర్వహణ పనితీరును పరిశీలించారు. బాధిత మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కేసుల నిర్వహణ, అత్యవసర సేవలపై అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హరి ప్రసాద్, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>