ప్రజావాణికి స్పందన కరువు.. అధికారులకు టైంపాస్!

కలం, నిర్మల్: తెలంగాణ ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో సోమవారం తొలిసారిగా ప్రజావాణి (Nirmal Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే తొలిరోజే ప్రజావాణికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సౌకర్యాలు లేని కొత్త మండలాలు..

నూతనంగా ఏర్పాటైన మండలాల్లో ప్రజావాణి నిర్వహణకు సరైన భవనాలు, సమావేశ మందిరాలు లేకపోవడంతో అధికారులు గ్రామపంచాయతీ కార్యాలయాలు, రైతు వేదికల్లో కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మౌలిక వసతులు కూడా సరిగా లేకపోవడం కనిపించింది.

హెల్ప్‌ డెస్క్ సిబ్బందికి ఎండ కష్టాలు..

ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఆశా కార్యకర్తలను కూడా అందుబాటులో ఉంచారు. అయితే వారికి తగిన వసతులు కల్పించకపోవడంతో బయట ఎండలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే సిబ్బంది ఇబ్బందులు పడటం విమర్శలకు తావిస్తోంది.

ప్రజలు రాక.. అధికారులకు ఖాళీ సమయం

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరైనప్పటికీ ప్రజల నుంచి పెద్దగా దరఖాస్తులు రాకపోవడంతో కార్యాలయాల్లో సందడి కనిపించలేదు. కొందరు అధికారులు ఖాళీగా కూర్చొని మొబైల్ ఫోన్లు చూస్తూ కనిపించారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం తొలిరోజే ఇలా వెలవెలబోవడం అధికారుల్లోనూ చర్చకు దారితీసింది.

మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయంపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ, సమస్యల పరిష్కార ప్రక్రియపై గ్రామస్థాయిలో ప్రచారం చేస్తే ప్రజల నుంచి స్పందన పెరిగే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>