Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలోని శాఖ గ్రంథాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పాఠకులకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. ఖాదర్ బాబా తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఎర్రుపాలెం, మధిర, మడుపల్లి శాఖ గ్రంథాలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆయా గ్రంథాలయ భవనాలు, మౌలిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ సభ్యులు, పాఠకులు, విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

​ఎర్రుపాలెం శాఖ గ్రంథాలయంలో ప్రహరీ గోడ నిర్మాణం, మరుగుదొడ్లు, కిటికీల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, భవనానికి పెయింటింగ్ వంటి పనుల ఆవశ్యకతను స్థానిక కాంగ్రెస్ నాయకులు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మధిర, మడుపల్లి గ్రంథాలయాల్లో ఉద్యోగ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం తాజా స్టడీ మెటీరియల్, కొత్త పుస్తకాలు, దినపత్రికలు, వారపత్రికలు, మ్యాగజైన్లను అందుబాటులో ఉంచాలని, భవనాలకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు, సభ్యులు చైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించారు.

​ఈ సందర్భంగా చైర్మన్ ఖాదర్ బాబా మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి, పాఠకులకు నాణ్యమైన సేవలు, ఆహ్లాదకరమైన అధ్యయన వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, అందుబాటులో ఉండే నిధులను బట్టి దశలవారీగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్‌చార్జి నాగలక్ష్మి నాయకులు, గ్రంథాలయ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>