కలం, వెబ్ డెస్క్: నర్సింగ్ పూర్తి చేసిన వారికి జపాన్, జర్మనీ వంటి దేశాల్లో డిమాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇక్కడి సిబ్బందిని నియమించుకోవడానికి ఆయా దేశాలు చాలా ఆసక్తి చూపుతున్నాయని వివరించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో మూడు ఆసుపత్రులకు కొబ్బరికాయ కొట్టి వదిలేశారని, తాము వచ్చాక వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ వివరించారు. వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందన్నారు. 2027 డిసెంబర్ నాటికి అన్ని ఆసుపత్రులను ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకో ప్రభుత్వాసుపత్రి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
ప్రత్యేక అధికారుల నియామకం..
టిమ్స్ ఆసుపత్రుల పనితీరు మరింత మెరుగుపడేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాటి నిర్వహణకు అవసరమైన నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన ఆసుపత్రులే కాదు, మెడికల్, నర్సింగ్ విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తామని స్ఫష్టం చేశారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్‌ను ఇక్కడికి తీసుకొచ్చి.. టిమ్స్ తామే కట్టించామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
టిమ్స్ కట్టడానికి వాళ్లకు పదేళ్ల సమయం సరిపోలేదా.. అని మండిపడ్డారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తమ బుద్ది మార్చుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. చేతబడులు, అఘోరా పూజలు మానుకోవాలంటూ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం సంపాదించిన రూ.లక్ష కోట్లను ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున పంచి పాపాలను కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు.

