కలం, వెబ్ డెస్క్: ఫాస్ట్ బౌలింగ్ కోసం భారత్ గైడెన్స్ అడిగిందంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) హై-పర్ఫార్మెన్స్ డైరెక్ర్ ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్ విజయం తర్వాత భారత్ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, అందులో భారత్ ఈ రిక్వెస్ట్ చేసిందని ఆకిబ్ చెప్పారు. పీసీబీ నిర్వహిస్తున్న ఓవర్సీస్ ప్లేయర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అభ్యర్థన వచ్చిందని తెలిపారు.
పీసీబీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆకిబ్, నేషనల్ హై-పర్‌ఫార్మెన్స్ సెంటర్ , నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 2006 నుంచి పనిచేయని, ఐసీసీ గుర్తింపు పొందిన బయోమెకానిక్స్ ల్యాబ్ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని చెప్పారు. ఈ సౌకర్యం ద్వారా అక్రమ బౌలింగ్ చర్యలను గుర్తించడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శనను మెరుగుపరచవచ్చన్నారు.
అలాగే, విదేశీ క్రికెటర్ల (Cricketers) కోసం నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల ద్వారా నెదర్లాండ్స్, ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లు ఇప్పటికే పాకిస్థాన్ (Pakistan)కు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం పాకిస్థాన్ క్రికెట్ కోచింగ్ వ్యవస్థల బలాబలాలను అంచనా వేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. భారత్–పాకిస్థాన్ సంబంధాలపై సరదాగా స్పందించిన ఆకిబ్, సాధారణ ప్రజల ఆలోచన ఒకలా ఉంటే, అధికార వ్యవస్థ దృష్టికోణం మరోలా ఉందని వ్యాఖ్యానించారు.


