కలం, వెబ్ డెస్క్: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకా సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ అమాయకులను బెదిరిస్తూ లక్షలు కాజేస్తున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలోనూ డిజిటల్ అరెస్ట్ (Digital Arrest) స్కామ్‌లు వెలుగుచూస్తున్నాయి. ‘హలో.. మేం సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం” అంటూ వీడియో కాల్స్ చేస్తున్నారు.
పోలీస్ యూనిఫారం, వెనకాల పోలీస్ స్టేషన్ (Police Station) సెటప్ చూసి దడ పుట్టేలా బెదిరిస్తున్నారు. వీడియో కాల్ కట్ చేయొద్దని హుకూం జారీ చేస్తున్నారు. పోలీస్, CBI, ED, కోర్ట్ అధికారులుగా నటిస్తున్నారు. నకిలీ వరంట్లు, డిజిటల్ అరెస్ట్ పేపర్లు చూపిస్తున్నారు. బాధితుల బ్యాంక్ వివరాలు తీసుకుని డబ్బు పంపించాలని బెదిరిస్తున్నారు. ఇదంతా సైబర్ గాళ్ల మాయాజాలం. చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనేదే లేదని పోలీసులు చెబుతున్నారు. ఇదంతా ఉట్టి భ్రమ అని, ఆ కాల్స్ నమ్మి ఆగమామై డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ బారినపడ్టట్లు అనుమానం వస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని హైదరాబాద్ పోలీసులు చెప్పారు.
ఎవరైనా నేరగాళ్లు ఫోన్ కాల్ (Phone Call) లేదా మెసేజ్ పంపితే నిజమైన అధికారులేనా? అని సందేహించి వెంటనే క్లారిటీ తీసుకోవాలి. ఎలాంటి వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఇవ్వొద్దు. తెలంగాణలో రోజురోజుకూ డిజిటల్ కేసులు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి‑జులై 2025 మధ్య కాలంలో 228 సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మొత్తం 1,313 కేసుల్లో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


