కలం, వెబ్ డెస్క్: టెక్సాస్‌లోని గాల్వేస్టోన్ కాజ్వే వద్ద మెక్సికో నేవీకి చెందిన ఒక విమానం(Mexico Navy plane) ఘోర ప్రమాదానికి గురైంది. మెక్సికో నుంచి బయలుదేరిన ఈ విమానం, గాల్వేస్టోన్ బేలోని నీటిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ఐదుగురు మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. మెక్సికో నేవీకి చెందిన ‘బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 350’ (Beechcraft King Air 350) విమానం సోమవారం మధ్యాహ్నం సమయంలో గాల్వేస్టోన్ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న ఒక చిన్నారిని మెరుగైన చికిత్స కోసం గాల్వేస్టోన్లోని ష్రైనర్స్ చిల్డ్రన్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
విమానం(Mexico Navy plane)లో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు మెక్సికో నేవీ అధికారులు, నలుగురు పౌరులు ఉన్నారు. మరణించిన వారిలో చిన్నారి, ఒక వైద్యుడు, ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడగా, మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో గాల్వేస్టోన్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉందని, విసిబిలిటీ చాలా తక్కువగా ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తున్నది. విమానం ల్యాండింగ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు నియంత్రణ కోల్పోయి నీటిలో పడిపోయింది.


