కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) నియోజకవర్గం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన సొంత మూడు ఎకరాల పొలంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు (MLA Vijaya Ramana Rao) బుధవారం ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్‌పామ్ సాగుకు (Oil Palm Cultivation) శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకప్పుడు నీటి కొరతతో ఇబ్బందులు పడిన ఈ ప్రాంతం ఎస్‌ఆర్‌ఎస్‌పీ డి-83, డి-86 కాలువలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు సాధించిందని అన్నారు. రైతులకు పంటల మార్పిడి అవసరాన్ని వివరించడమే కాకుండా తానే స్వయంగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో సుమారు 1.20 లక్షల ఎకరాలకు పైగా సాగునీటి ఆయకట్టు ఉందని, ఈ సీజన్‌లో 2.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 27 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులకు ధాన్యం విక్రయించిన 24 గంటలలోనే చెల్లింపులు అందుతున్నాయని వెల్లడించారు. యూరియా కొరత లేకుండా ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధం చేశామని, అవసరమైతే మరింత తెప్పిస్తామని స్పష్టం చేశారు. అధిక యూరియా వినియోగం భూమి సారాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తూ, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ ఆయిల్‌పామ్ (Oil Palm) సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్న ఆయన (MLA Vijaya Ramana Rao), ప్రభుత్వం తక్కువ ధరకు మొక్కలు అందిస్తోందని, నాలుగేళ్ల తర్వాత ఎకరాకు సుమారు రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని అన్నారు. ఈలోగా అంతర పంటలు సాగు చేసుకోవచ్చని వివరించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, పలు గ్రామాల సర్పంచ్‌లు , ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఎంతపొడవో..! భారత్‌పై 1,500 కి.మీ మేఘం
Follow Us On : WhatsApp

