epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఒక్కడిపై ఆరుగురు.. కేసీఆర్ ప్రెస్ మీట్‌కు కాంగ్రెస్ వరుస కౌంటర్లు

కలం, వెబ్​ డెస్క్​: దాదాపు రెండేళ్ల తర్వాత రాజకీయంగా యాక్టివ్‌గా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్‌తో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ‘ఇక నిశ్శబ్దంగా ఉండను.. అన్యాయాలపై అడుగడుగునా ప్రశ్నిస్తాం’ అంటూ ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా జలాలు, ప్రభుత్వ వైఫల్యాలు, నేరాల పెరుగుదల వంటి అంశాలపై ఘాటుగా మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్‌కు కాంగ్రెస్ వైపు నుంచి వెంటనే తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఆరుగురు మంత్రులు వరుసగా ప్రెస్ మీట్లు, చిట్‌చాట్‌లతో కౌంటర్ దాడికి దిగారు.

కేసీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌లో స్పందించారు. కేసీఆర్‌ను (KCR) ‘ఆర్థిక ఉగ్రవాది’ అని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తగ్గింపునకు కారణం కేసీఆర్ అని ఆరోపించారు. ‘అసెంబ్లీకి రండి, చర్చిద్దాం’ అని సవాల్ విసిరారు. అనంతరం మొదట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్ ఆరోపణలను ఖండించారు. పాలమూరు ప్రాజెక్ట్ డీపీఆర్ 2023 ఏప్రిల్‌లోనే తిరిగి పంపబడిందని స్పష్టం చేశారు.

మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు మరుసటి రోజు గాంధీభవన్‌లో విడివిడిగా ప్రెస్ మీట్లు నిర్వహించారు. కేసీఆర్ పార్టీ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికే మాట్లాడుతున్నారని, ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను తోలు తీశారని వ్యంగ్యంగా విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల ఓటమితో ఏర్పడిన నిరాశతో వచ్చినవే అని పేర్కొన్నారు.

అయితే కొందరు మంత్రులు ప్రిపేర్ కాకుండా మాట్లాడటంతో అయోమయానికి గురయ్యారని, మరికొందరు వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరకు అసెంబ్లీలో చర్చిద్దామనే సవాళ్లతోనే మంత్రులు ముగించారు. అయితే కేసీఆర్ ఈ ప్రెస్ మీట్‌తో తన పార్టీ క్యాడర్‌కు కొత్త ఊరట ఇచ్చారు. కానీ కాంగ్రెస్ (Congress) వైపు నుంచి ఇంత పెద్ద స్థాయిలో స్పందన రావడం ఆయన ప్రభావాన్నే సూచిస్తోందని అంటున్నారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రాజకీయ యుద్ధం మరింత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>