Mobile Popup Ad
Mobile Popup Ad

అమరుల త్యాగం.. అమ్మకానికి!

కలం, మెద‌క్ బ్యూరో : అమరుల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన స్మారకం (Husnabad Martyrs Memorial) అది.. నేడు కబ్జాదారుల కబంధహస్తాల్లో బందీ అయింది. ఒకనాటి పోరాటాల గడ్డ.. నేడు వెంచర్ల రూపంలో అమ్ముడుపోతున్నది. ఆ చారిత్రక ప్రాంతాన్ని కాపాడుకునేందుకు హుస్నాబాద్ ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఒకప్పుడు విప్లవోద్యమానికి ప్రతీకగా నిలిచిన హుస్నాబాద్ ‘అన్నల భూమి’ ఇప్పుడు భూ వివాదాల కేంద్రంగా మారింది. అమరులైన నక్సలైట్ల జ్ఞాపకార్థం నిర్మించిన ఆసియాలోనే రెండో అత్యంత ఎత్తైన అమరవీరుల స్మారక స్థూపం (Husnabad Martyrs Memorial) పరిసర భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని జేఏసీ నేతలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ స్థలాన్ని పరిరక్షించి, స్థూపాన్ని పునర్నిర్మించడంతో పాటు భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆసియాలోనే ప్రత్యేక గుర్తింపు

హుస్నాబాద్–అక్కన్నపేట రోడ్డులోని సర్వే నంబర్ 1189 పరిధిలో ఎత్తయిన ప్రదేశంలో 88 అడుగుల ఎత్తుతో అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించారు. చైనాలోని తియాన్మెన్ స్క్వేర్ స్మారక స్థూపం తర్వాత ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద అమరవీరుల స్థూపంగా ఇది గుర్తింపు పొందింది. 1972 నుంచి 1989 మధ్యకాలంలో పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన పీపుల్స్ వార్కు చెందిన 88 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం ఈ స్థూపాన్ని నిర్మించారు.

ఆనాటి విలువ ప్రకారం దాదాపు రూ.12 లక్షల వ్యయంతో రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా నల్ల గ్రానైట్ రాయిని తెప్పించి నిర్మించారు. స్థూపం పైభాగంలో విప్లవోద్యమానికి ప్రతీకగా 110 కిలోల బరువున్న భారీ ఇనుప సుత్తి-కొడవలిని అమర్చగా, దిగువ భాగంలో అమరులైన 88 మంది పేర్లను చెక్కించారు. ఆనాటి ప్రభుత్వ అడ్డంకులను ఎదుర్కొంటూ ప్రజల భాగస్వామ్యంతో ఈ స్థూపాన్ని నిర్మించారు. దండకారణ్యం వెలుపల నిర్మించిన అత్యంత ఎత్తైన చారిత్రక విప్లవ స్మారక స్థూపంగానూ ఇది గుర్తింపు పొందింది.

బాంబులతో నేలమట్టం

1990లో అమరుడు పులి రాములు తండ్రి పులి మల్లయ్య చేతుల మీదుగా ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో ప్రజాకవి గద్దర్, విప్లవ కవి వరవరరావు, పౌరహక్కుల నేత బాలగోపాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అయితే రాజకీయ, శాంతిభద్రతల కారణాలను చూపుతూ 2000 సంవత్సరంలో ‘గ్రీన్ టైగర్స్’ పేరుతో స్థూపాన్ని బాంబులతో కూల్చివేశారు. స్థూపం ధ్వంసమైనప్పటికీ.. ఆ ప్రాంతం అమరుల త్యాగాలకు ప్రతీకగానే నిలుస్తూ వస్తున్నది. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ‘అన్నల భూమి’గా పేర్కొంటూ, అక్కడ ప్రజా కోర్టులు నిర్వహించేవారని గుర్తు చేసుకుంటున్నారు.

వివాదంలో స్థూపం భూములు

చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ స్థూపం పరిసర భూములు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. హుస్నాబాద్ జేఏసీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ డీఎస్పీ ముత్తినేని రామచంద్రారెడ్డికి చెందిన 8 ఎకరాల 13 గుంటల భూమి భూ పరిమితి (సీలింగ్) చట్టం కింద ప్రభుత్వానికి వెళ్లింది. అనంతరం స్థూపం నిర్మాణ సమయంలో గడిపే స్వామికి ఒక ఎకరం, గడిపే ఆగయ్యకు ఒక ఎకరం, కాశీ తురకలకు నాలుగు ఎకరాలు, మిగిలిన భూమిని పీపుల్స్ వార్ కార్యకలాపాల కోసం లిఖితపూర్వకంగా కేటాయించినట్లు వారు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం సర్వే నంబర్ 1189/బిలోని భూమిని కొందరు పట్టా భూమిగా మార్చుకుని వెంచర్లు ఏర్పాటు చేయడంతో పాటు భవన నిర్మాణాలు చేపడుతున్నారని స్థూపం స్థల సాధన కమిటీ ఆరోపిస్తున్నది.

రికార్డులు బయటపెట్టాలని డిమాండ్

స్థూపం స్థలంలో రామచంద్రారెడ్డి కుమారుడు రాజేశ్వర్రెడ్డి రెండంతస్తుల ఇంటితో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని వారు పేర్కొన్నారు. అలాగే నాలుగు ఎకరాల భూమిని గతంలో సీలింగ్ భూమిగా గుర్తించి ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన విషయం కూడా కోర్టు కేసు ద్వారా వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో భూమికి సంబంధించిన పూర్తి రికార్డులు, లింక్ డాక్యుమెంట్లను పరిశీలించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భూ వివాదాల నేపథ్యంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న రాజేశ్వర్రెడ్డికి హుస్నాబాద్ మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసి, భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది.

భూముల పరిరక్షణకు జేఏసీ ఉద్యమం

అమరుల స్థూపం పరిసర భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో గత నెల 24న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సర్వే నంబర్ 1189లోని చారిత్రక స్థూపం భూమిపై సమగ్ర సర్వే నిర్వహించాలని, 1189/బికి సంబంధించిన అన్ని భూ రికార్డులను బహిరంగపరచాలని వారు డిమాండ్ చేశారు. హుస్నాబాద్ అమరుల స్థూపం స్థల సాధన కమిటీ ఆధ్వర్యంలో న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.

మంత్రి మాట నిలబెట్టుకోవాలి..

రెండేండ్ల కింద ప్రజా నాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అమరుల స్థూపం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆ సందర్భంగా హుస్నాబాద్ జేఏసీ విజ్ఞప్తి మేరకు స్థూపాన్ని పునర్నిర్మించి, స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీని అమలు చేస్తూ చారిత్రక స్థలాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న పీపుల్స్ వార్ అమరవీరుల స్మారక స్థూపాన్ని పునర్నిర్మించడంతో పాటు స్మృతి వనం, లైబ్రరీ ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also: ఓటు పోతే.. స్కీమ్‌లు కట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>