కలం, వెబ్ డెస్క్ : ఫిఫా 2026 నాకౌట్ మ్యాచ్‌కు ముందు కేప్ వర్డే జట్టుకు భారీ షాక్ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో నాకౌట్‌కు ముందు కేప్ వర్డే కెప్టెన్‌పై పోలీసు కేసు నమోదయింది. ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఆ జట్టు కెప్టెన్ ర్యాన్ మెండిస్ (Ryan Mendes) పై తీవ్రమైన రేప్ ఆరోపణలు రావడం ఫుట్‌బాల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. టర్కీ క్లబ్‌కు ఆడుతున్న ఈ ఫార్వర్డ్ ఆటగాడిపై న్యూజిలాండ్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌లో జరిగిన ఫిఫా సిరీస్ టోర్నమెంట్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో జట్టుతో కలిసి ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన ఒక బ్రెజిల్ మహిళపై మెండిస్ ఆక్లాండ్ హోటల్లో లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఆ సమయంలో ఫిఫా నియమించిన టీమ్ సపోర్ట్ వర్కర్‌గా విధులు నిర్వర్తించారు. మెండిస్ (Ryan Mendes) తన గదిలోకి ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టాడని సదరు మహిళ ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఆమె వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు కేప్ వర్డే జట్టుకు చెందిన ముగ్గురు అధికారులకు కూడా ఈ విషయంపై సమాచారం అందించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై ఫిఫా స్పందిస్తూ ఏ విధమైన దుష్ప్రవర్తన ఆరోపణలనైనా తాము చాలా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాము న్యూజిలాండ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ దశలో మరిన్ని వ్యాఖ్యలు చేయలేమని ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే కేప్ వర్డే జట్టు యాజమాన్యం ఈ అంశంపై ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరోవైపు ఈ వివాదం పక్కన పెడితే, గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో కేప్ వర్డే జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం రాత్రి సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుని టోర్నమెంట్లో ముందడుగు వేసింది. ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉండే ఈ చిన్న ద్వీప దేశం వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే మొదటిసారి ఆడుతోంది.
గ్రూప్ మ్యాచ్‌లలో మాజీ ఛాంపియన్ స్పెయిన్‌ను 0-0తో అడ్డుకోవడమే కాకుండా, ఉరుగ్వేతో 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తంగా మూడు పాయింట్లతో గ్రూప్ హెచ్లో స్పెయిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. గతంలో 1958లో వేల్స్, 1990లో ఐర్లాండ్, నెదర్లాండ్స్, 1998లో చిలీ జట్లు కూడా ఇలాగే మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుని తదుపరి రౌండ్‌కు వెళ్లాయి.
అయితే 2010 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ మూడు డ్రాలు సాధించినా టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. ఏదేమైనా ఈ ఆరోపణల నేపథ్యంలో శనివారం మియామీలో అర్జెంటీనాతో జరగబోయే రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో కేప్ వర్డే జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
Read Also: యువతలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు.. అసలు కారణమిదే!
Follow Us On: Instagram

