Mobile Popup Ad
Mobile Popup Ad

పాలమూరు భవిష్యత్తు కోసమే రాజకీయాలు చేస్తా: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: చిల్లరమల్లర రాజకీయాల కోసం రాజకీయాల్లోకి తాను రాలేదని, కేవలం పాలమూరు భవిష్యత్తు కోసమే రాజకీయాలకు వచ్చానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పాత్రికేయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీ కాలేజీలో 65 శాతం మన ఉమ్మడి మహబూబ్ నగర్ బిడ్డలే ప్రవేశాలు పొందారని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.600 కోట్లు మంజూరు చేయించుకొచ్చిన దానికంటే కూడా ఇది తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించిందన్నారు.

విద్యార్థుల కోసం “శతశాతం”..

గత ఏడాది చాలా తక్కువ మంది ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఐఐఐటీ కళాశాలలో ప్రవేశాలు పొందారని ఎమ్మెల్యే యెన్నం (Yennam Srinivas Reddy) అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా మహబూబ్ నగర్ బిడ్డలే అధికంగా ఐఐఐటీ కళాశాలలో సీట్లు పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా విద్యార్థులకు క్యూఆర్ కోడ్ తో తయారు చేయించిన డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందించినట్లు తెలిపారు. “శతశాతం” కార్యక్రమం ద్వారా సొంత నిధులతో నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ హైస్కూల్ లో విద్యా వాలంటీర్లను నియమించడం జరిగిందని చెప్పారు. వారు విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని ఆయన చెప్పారు.

ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన ఫలితాలను తమ మహబూబ్ నగర్ విద్యార్థులు సాధించారని యెన్నం చెప్పారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యా వాలంటీర్లు, తాము చూపించిన ప్రత్యేక శ్రద్ధ కూడా ఒకటి అని ఆయన అభిప్రాయపడ్డారు. శత శాతం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులకు 45 రోజులపాటు ఐఐఐటీ లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. అందుకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి 170 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఆయన చెప్పారు.

పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు..

ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో జిల్లా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు పొందేలా “శతశాతం” కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యజ్ఞంలా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, విద్యా వాలంటీర్లను నియమించి విద్యార్థులకు అదనపు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. మహబూబ్ నగర్‌లో 100 శాతం ఫలితాలు నమోదు కాగా, జిల్లాలో అది 94 శాతం మేరకు రావడం ఆనందకరమని, గర్వకారణమని అన్నారు.

ఇది ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల ఫలితమని కొనియాడారు. ప్రతి విద్యార్థి ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీకి దరఖాస్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి సుమారు 33 వేల వరకు చేరిందని, గత ఏడాది 19,720 మాత్రమే దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఇది జిల్లాలో విద్యాపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

డిగ్రీ కళాశాలలలో కూడా మంచి ఫలితాలు..

అలాగే డిగ్రీ కళాశాలలలో కూడా మంచి ఫలితాలు నమోదవుతున్నాయని, చాలా మంది యువత క్యాంపస్ సెలక్షన్ లలో ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన చెప్పారు. గత సంవత్సరం వచ్చిన 3 ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి విద్యాసంవత్సరం పూర్తి కావడం జరిగిందని, అక్కడ 500 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మొత్తం విద్యా వ్యవస్థలో ఇది ఒక గొప్ప మార్పు కనిపిస్తుందని, ఈ మార్పుకు తమతో పాటు డీఈఓ నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయుడి వరకు అందరి కృషి దాగి ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో విద్యా రంగంలో పలు సంస్కరణలు అమలవుతూ.. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు వెంకటేష్, సిజే బెనహర్, జిల్లా గొర్రెల కాపరులు సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, కార్పొరేటర్ మజ్జీద్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: వర్షపు జల్లుల్లో జలపాతాల జోరు.. తెలంగాణలో టాప్ వాటర్‌ఫాల్స్ ఇవే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>