భద్రాద్రి కొత్తగూడెంలో ‘సేవ్ మణుగూరు’ బంద్‌కు భారీ మద్దతు

కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి బొగ్గు గనుల రక్షణే ధ్యేయంగా భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరులో అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు సమరభేరి మోగించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ గురువారం చేపట్టిన మణుగూరు పట్టణ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ‘సేవ్ మణుగూరు’ (Save Manuguru) పిలుపుతో సాగిన ఈ ఆందోళనకు స్థానిక వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి బంద్‌లో భాగస్వామ్యమయ్యాయి.

​ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ మణుగూరు (Manuguru) పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్ మాట్లాడుతూ.. 1974లో పీకే-1 గనితో ప్రారంభమైన మణుగూరు సింగరేణి ప్రస్థానం, ఆ తర్వాత పలు గనుల విస్తరణతో సుమారు 6,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు. ఈ బొగ్గు గనుల ఆధారంగానే మణుగూరు ప్రాంతం ఎంతో వృద్ధి చెందిందని, కానీ నేడు పాలకులు, ఉన్న గనులను ప్రైవేట్ పరం చేస్తూ చేతులు దులుపుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు.

​ప్రస్తుతం నడుస్తున్న మణుగూరు ఓసీ (OC) గడువు 2027తో ముగియనుండటంతో, దాని మైనింగ్ అనుమతులను వెంటనే పొడిగించాలని, అలాగే పీకే ఓసీ డిప్‌సైడ్ బ్లాక్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా పూర్తిగా సింగరేణికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గనులను సింగరేణి పరిధిలోనే ఉంచితే కార్మికులకు మరో 10 సంవత్సరాల పాటు ఉపాధి ఢోకా ఉండదని, లేనిపక్షంలో వారిని వేరే ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

మణుగూరులో ఇంకా 25 ఏళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గనులను కాపాడకపోతే, రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు పిలుపునిస్తామని అఖిలపక్షం తరఫున హెచ్చరించారు. బంద్‌ను జయప్రదం చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారస్థులు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: వర్షపు జల్లుల్లో జలపాతాల జోరు.. తెలంగాణలో టాప్ వాటర్‌ఫాల్స్ ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>