Mobile Popup Ad
Mobile Popup Ad

వర్షపు జల్లుల్లో జలపాతాల జోరు.. తెలంగాణలో టాప్ వాటర్‌ఫాల్స్ ఇవే!

కలం, వెబ్ డెస్క్: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పాలనురగలను తలపించే జలపాతాలు (Waterfalls), పచ్చని పరిసరాలతో తెలంగాణ సరికొత్త శోభను సంతరించుకుంటుంది. ఎండిపోయిన వాగులు జీవం పోసుకుంటాయి. చెరువులు మత్తడి దుంకుతాయి. నదులు పరవళ్లు తొక్కుతాయి. ఈ సీజన్‌లో పచ్చని కొండల మధ్య నుంచి దూకే జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరవాసులకు వీకెండ్‌లో ప్రకృతి ఒడిలో గడపడానికి జలపాతాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.

ఎత్తిపోతల-నాగార్జున సాగర్

హైదరాబాద్‌కు దాదాపు 165 నుంచి 173 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ సమీపంలో ఈ జలపాతం (Waterfalls) ఉంది. చంద్రావంక, నక్కవాగు, తుమ్మలవాగు అనే మూడు ఉపనదుల కలయికతో ఏర్పడింది. ఈ జలపాతం దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతుంది. ఆ తర్వాత ఈ నీరంతా కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ జలపాతం పక్కనే ఉన్న మొసళ్ల పెంపకం కేంద్రాన్ని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. రాత్రి వేళల్లో ఇక్కడ ఏర్పాటు చేసే కలర్‌ఫుల్ లైటింగ్ షో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కుంతాల జలపాతం-ఆదిలాబాద్

తెలంగాణలోనే ఎత్తైన జలపాతాల్లో కుంతాల జలపాతం మొదటి వరుసలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడెం నదిపై ఉన్న ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవులు, సహజసిద్ధమైన కొండల మధ్య దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి ఉవ్వెత్తున పడే నీటి ధారలను చూడటం మధురానుభూతి. ట్రెక్కర్స్, ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం.

బొగత-ములుగు

దీనిని ‘తెలంగాణ నయాగరా’ అని పిలుస్తారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో, హైదరాబాద్‌కు సుమారు 270 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య ఈ ఉంది. వర్షాకాలంలో రాతి కొండల మీదుగా ఉధృతంగా ప్రవహించే ఈ జలపాతం హోరు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపిస్తుంది. పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్య వెడల్పుగా పారే నీటి ధారలు అచ్చం నయాగరా జలపాతాన్ని తలపిస్తాయి. ఫొటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇది పర్‌ఫెక్ట్ స్పాట్.

మల్లెల తీర్థం-నాగర్‌కర్నూల్

నల్లమల అటవీ ప్రాంతంలోని అందాలను చూడాలంటే నాగర్‌కర్నూల్ జిల్లాలోని మల్లెల తీర్థం వెళ్లాల్సిందే. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. దట్టమైన అడవి గుండా ప్రయాణించి, దాదాపు 400 మెట్లు కిందికి దిగితేనే ఈ సుందర దృశ్యం కనిపిస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన చెట్ల మధ్య ఒకే ఒక ధారగా కింద పడే నీరు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి.

భీముని పాదం-మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఉన్న భీముని పాదం జలపాతం ఉంది. హైదరాబాద్‌కు సుమారు 195 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం దాదాపు 70 అడుగుల ఎత్తు నుండి పడుతుంది. ఇక్కడి నీటి తుంపరలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి. ఎండకాలంలోనైనా సరే ఇక్కడ నీటి ప్రవాహం అస్సలు ఎండిపోదు. ఈ నీటికి మూలాధారం ఎక్కడుందో ఇప్పటికీ ఒక రహస్యమే.

కొన్ని జాగ్రత్తలు: వర్షాకాలంలో ఈ జలపాతాల వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిలోకి దిగేటప్పుడు, సెల్ఫీలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ఈ ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించండి.

Read Also: ఇక ఫోన్ నంబర్ అక్కర్లేదు.. వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>