కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిలో ‘ఆవకాయ’ ఫెస్టివల్ (Avakai Festival) నిర్వహించబోతున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార వైవిధ్యాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో ఆవకాయ ఫెస్టివల్ (Avakai Festival) జరపబోతున్నారు. జనవరి 8 నుంచి 10 తేదీల వరకు మూడు రోజుల పాటు విజయవాడలో ఈ వేడుక నిర్వహించబోతున్నట్టు ఏపీ పర్యాటకశాఖ కార్యదర్శి ఆమ్రపాలి చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు తాము టీమ్ వర్క్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నామని ఆమ్రపాలి వివరించారు. తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకొస్తామన్నారు. అందుకోసం ఆవకాయ పేరుతో ఒక ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ఈ ఆవకాయ ఫెస్టివల్‌తో (Avakai Festival) ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు.
తెలుగు ప్రజల ఆహార సంస్కృతిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆవకాయను కేంద్రంగా చేసుకొని ఈ ఉత్సవాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. అమరావతి బ్రాండ్‌ను సాంస్కృతికంగా బలోపేతం చేయడంతో పాటు, రాష్ట్రానికి పర్యాటక ఆకర్షణ పెంచడమే ఈ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్‌లో తెలుగు వంటకాల ప్రదర్శనలు, సంప్రదాయ ఆహార స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలుగు కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకాలు వంటి కార్యక్రమాలతో పాటు ప్రజలను ఆకట్టుకునే ప్రత్యేక ఈవెంట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
స్థానిక కళాకారులు, వంటలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఫెస్టివల్ ద్వారా వేదిక కల్పించనున్నట్లు ఆమ్రపాలి తెలిపారు. ఆవకాయతో పాటు ఇతర సంప్రదాయ పచ్చళ్లు, వంటకాల తయారీ విధానాలను ప్రజలకు ప్రత్యక్షంగా పరిచయం చేయనున్నారు. ఈ ఉత్సవం ద్వారా అమరావతిని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని యువతకు దగ్గర చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రజలందరూ ఈ ఆవకాయ అమరావతి ఫెస్టివల్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.


