కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ (Nalgonda Congress) పార్టీకి కంచుకోట. అలాంటి జిల్లాలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కింది స్థాయి కేడర్ అంతా నల్లగొండ వైపు కదిలి వచ్చారు. కానీ, మునుగోడు నియోజకవర్గం మాత్రం పూర్తిగా సైలెంట్‌గా ఉండిపోయారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) పిలుపు లేకపోవడంతో మునుగోడు కేడర్ కనీసం నల్లగొండ వైపు కన్నెత్తి చూడలేదు.
నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు, అనుచరులకు అందుబాటులో ఉండే రాజగోపాల్ రెడ్డి సీఎం పర్యటన రోజే హైదరాబాద్‌కే పరిమితమవడం అంటే వ్యూహాత్మక దూరమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలోనూ రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు ఇదే తరహాలో ఆయన దూరంగా ఉన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలపైనే పోలీసుల ఆంక్షలు..
ముఖ్యమంత్రి పర్యటనల వేళ ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేయడం సాధారణం. కానీ నల్లగొండలో పరిస్థితి భిన్నంగా మారింది. సీఎం సభకు ముందే మునుగోడు (Munugode) నియోజకవర్గానికి చెందిన రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ప్రధాన అనుచరులు, స్థానిక కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేయడం జిల్లాలో కలకలం రేపింది.
ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి జిల్లా సరిహద్దుల్లోకి కూడా రాకుండా హైదరాబాద్ నగరానికే పరిమితమై సీఎం సభకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మంత్రి పదవి దక్కలేదని అలకనా..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కంటే తానే సీనియర్ అనే భావన రాజగోపాల్ రెడ్డిలో బలంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం రేసులో ఉంటానని భావించిన ఆయనకు హైకమాండ్ రేవంత్ వైపు మొగ్గు చూపడం తొలి షాకింగ్‌గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కినప్పటికీ తనకు మాత్రం అవకాశం రాకపోవడం అసంతృప్తికి కారణమైంది.
ఇటీవల ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని కలిసినా “ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు” అని స్పష్టత రావడంతో ఆశలు మరింత తగ్గినట్లు తెలుస్తున్నది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం ఇద్దరి మధ్య గ్యాప్ మరింత స్పష్టం చేసింది.
కోమటిరెడ్డి సోదరుల్లో డైలమా!
- ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాను శాసించిన ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ బ్రాండ్ ఇప్పుడు భిన్న దారుల్లోకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నది.
- అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటే, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం వైఖరిపై అసంతృప్తితో ఒంటరి పోరాటం చేస్తున్నారు.
- “అన్న ఒక దారి.. తమ్ముడు ఒక దారి” రాజకీయంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం అయోమయంలో పడింది.
కేసీఆర్‌పై సానుభూతి.. స్కెచ్ ఏంటీ?
ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్‌కు మింగుడుపడటం లేదు. గతంలో కేసీఆర్‌పై విమర్శలు చేసిన ఆయన.. తాజాగా “కేసీఆర్ పెద్ద ఉద్యమకారుడు.. ఆయన్ను కూతురు కవిత సరిగ్గా గౌరవించలేకపోయింది” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో తన ప్రాధాన్యం తగ్గితే బీఆర్ఎస్ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? లేక హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహమా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
మళ్లీ రూట్ మారుస్తున్నారా..?
గతంలో కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. మళ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఆయన వైఖరిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒంటరి పోరాట వైఖరి, సీఎం సభలను బహిష్కరించడం చూస్తుంటే.. ‘‘అసలు మన నాయకుడు పార్టీలో ఉంటారా? లేక మళ్లీ రూట్ మారుస్తున్నారా?’’ అనే సందిగ్ధత మునుగోడు కాంగ్రెస్ కేడర్‌లో కనిపిస్తున్నది. లీడర్ క్లారిటీ ఇవ్వకపోవడంతో అటు కార్యకర్తలు కూడా ఏం చేయాలో తెలియక స్తబ్దుగా ఉండిపోవాల్సి వస్తున్నది.
Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!
Follow Us On: Instagram

