Mobile Popup Ad
Mobile Popup Ad

కోటి పరిహారంపై ‘సిగాచి’ కొత్త వాదన!

క‌లం, మెద‌క్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో గతేడాది జరిగిన సిగాచి కంపెనీ (Sigachi) ప్రమాదంపై కార్పొరేట్ సంస్థ తన తీరు మరోసారి బయటపెట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు కుప్పకూలకుండా ఉండేందుకు మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఆ హామీ నుంచి వెనక్కి తగ్గింది. తాము రూ.1 కోటి పరిహారం ప్రకటించలేదని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో బాధిత కుటుంబాలు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితిలోకి నెట్టింది.

సిగాచి ప్లాంట్‌ ప్రమాదంలో మొత్తం 54 మంది కార్మికులు మృతి చెందారు. ఏడాది గడిచినా బాధిత కుటుంబాలు పూర్తి పరిహారం కోసం, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నాయి. అయితే.. ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత సిగాచి సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్ చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ లకు పంపిన అధికారిక లేఖలో ప్రతి మృతుడి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది. ఆ లేఖ ఇప్పటికీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కాగా.. బాధితుల తరఫున హైకోర్టులో కేసులు కొనసాగుతుండగానే గత మార్చి 11న కంపెనీ అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో గతంలో కోర్టుకు సమర్పించిన పట్టికలో ‘ ఎక్స్‌గ్రేషియా’ అనే పదం పొరపాటున పడినట్టు అందులో పేర్కొంది. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.42 లక్షలు మాత్రమే చెల్లించినట్లు కోర్టు ముందు అంగీకరించింది.

అంతేకాకుండా ఆ రూ.42 లక్షలు కూడా పూర్తిగా కంపెనీ చెల్లించిన పరిహారం కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం, ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బీమా వంటి చట్టబద్ధమైన హక్కుల మొత్తాలను కలిపి ‘కాంపోజిట్ పేమెంట్’ గా చూపుతున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. దీంతో కార్మికుల హక్కులైన పీఎఫ్, ఈఎస్ఐ వంటి మొత్తాలను కూడా తన పరిహారంలో కలిపి చూపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాగే రూ.42 లక్షల పరిహారంపైనే ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని కంపెనీ పేర్కొన్నప్పటికీ, ఆ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను ఇప్పటివరకు ప్రభుత్వం గానీ, కంపెనీ గానీ బయటపెట్టలేదు.

సీఎం హామీ అమలుకు నోచుకోలేదు

ప్రమాదం జరిగిన మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇస్తుందా? కంపెనీ ఇస్తుందా? అనే ప్రశ్నకు, ఏ విధంగానైనా ప్రతి కుటుంబానికి రూ.1 కోటి అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష మాత్రమే అందించింది.

కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి ప్రకటించిన మొత్తాలు కూడా మొత్తం 54 కుటుంబాల్లో కేవలం 43 కుటుంబాలకే చేరాయి. మిగిలిన 11 కుటుంబాలకు ప్రభుత్వ సాయం కూడా అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులకు పూర్తి పరిహారం అందేలా కంపెనీపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజా సంఘాల న్యాయపోరాటం

తెలంగాణ పీపుల్స్ జేఏసీ, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, మానవ హక్కుల వేదిక, జాతీయ ఉద్యమాల ప్రజా వేదిక వంటి తదితర ప్రజా సంఘాలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ న్యాయపోరాటం ఫలితంగానే కొంత మేర పరిహారం చెల్లింపులు జరిగాయని బాధితులు పేర్కొంటున్నారు. సిగాచి కంపెనీ (Sigachi) తొలుత ప్రకటించినట్టుగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 కోటి పూర్తి పరిహారం చెల్లించాలని, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>