కలం, స్పోర్ట్స్ బ్యూరో: ఫుట్‌బాల్ ప్రపంచం శ్వాస బిగబట్టి చూస్తోంది.. ప్రపంచకప్ (FIFA World Cup) ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. 48 జట్ల మహా సంగ్రామంలో లెక్కలు మారాయి.. వ్యూహాలు మారాయి. గ్రూప్ దశలో జయాపజయాలను పక్కన పెడితే.. ఇప్పుడు మొదలైంది అసలైన వేట. ఇక్కడ జరిగే ఒక్క చిన్న పొరపాటు.. నాలుగేళ్ల కలలను చిటికెలో కరిగిస్తుంది. గెలిస్తే ముందుకు.. లేదంటే ఇంటికే..!
ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) 2026లో లీగ్ దశ పోరాటాలు ముగిసి, టోర్నీ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన నాకౌట్ (రౌండ్ ఆఫ్ 32) దశకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన 72 లీగ్ మ్యాచ్‌ల తర్వాత.. టోర్నీలో పాల్గొన్న 48 జట్లలో ఏకంగా 16 జట్లు కన్నీళ్లతో ఇంటిబాట పట్టాయి. ఇప్పుడు టైటిల్ రేసులో కేవలం 32 జట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు ఫ్రాన్స్, బ్రెజిల్, ఇంగ్లండ్, స్పెయిన్ వంటి అగ్రశ్రేణి జట్లు ఆశించినట్లుగానే ఈ దశకు చేరుకున్నాయి. అయితే ఈసారి టోర్నీలో కేప్ వెర్డే వంటి చిన్న జట్లు చూపిన అసాధారణ ప్రతిభ సాకర్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.
ఇక లెక్కలుండవు.. ‘డూ ఆర్ డై’ అంతే!
ఇక్కడితో కథ మారిపోయింది. లీగ్ దశలో తప్పులు చేసినా కోలుకోవడానికి అవకాశం ఉండేది. నాకౌట్ పోరులో మాత్రం ఆ ఛాన్స్ లేదు. కేవలం 90 నిమిషాల పోరాటమే.. నాలుగేళ్ల కలను నిలబెడుతుందో, కూలదోస్తుందో తేల్చేస్తుంది. చిన్న పొరపాటు జరిగినా ప్రపంచకప్ కల అక్కడితోనే ముగుస్తుంది. నిన్నటి వరకు సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు ఇక్కడ లెక్కలోకి రావు. ఈ ‘డూ ఆర్ డై’ పోరులో ఎవరు ఒత్తిడిని జయించి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారో వారే ముందుకు సాగుతారు. ఈ గండం దాటిన జట్లు జులై 4 నుంచి జరిగే రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్స్)లో తలపడతాయి. అక్కడి నుంచి జులై 9 నుంచి క్వార్టర్ ఫైనల్స్, జులై 14, 15 తేదీల్లో సెమీఫైనల్స్ జరగనున్నాయి. జులై 19న న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ జరగనుంది.
వాళ్లు అడుగుపెడితే పూనకాలే..
ఈ ప్రపంచకప్‌లో కేంద్ర బిందువుగా నిలిచిన అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ మైదానంలో అడుగుపెడితేనే అభిమానుల్లో పూనకాలు వస్తున్నాయి. మరోవైపు, సాకర్ ప్రపంచానికి కాబోయే మహారాజు తానేనని చాటిచెబుతూ ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపె ఉప్పెనలా దూసుకుపోతున్నాడు. ఇక ఇంగ్లండ్ ఆశల భారమంతా అనుభవజ్ఞుడు హ్యారీ కేన్ మోస్తుంటే.. అదే జట్టు యువ సంచలనం జూడ్ బెల్లింగ్హామ్ కొత్త తరం సైన్యానికి సేనాధిపతిలా మారాడు. వీరికి తోడు బ్రెజిల్ స్టార్ వినిసియస్ జూనియర్, స్పెయిన్ వండర్కిడ్ లామిన్ యమాల్, జర్మనీ మాయాజాల ఆటగాడు జమాల్ ముసియాలా వంటి కుర్రాళ్లు తమ సంచలన ఆటతీరుతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
అన్నింటికీ 20 రోజుల్లో సమాధానం..
ఈ నేపథ్యంలో సాకర్ సామ్రాజ్యంలో అత్యున్నత వ్యక్తిగత పురస్కారమైన ‘గోల్డెన్ బూట్’ను గెలిచే ఆ వీరుడు ఎవరు? ప్రత్యర్థుల దాడులను అడ్డుకుని జట్టుకు అండగా నిలిచే ఉత్తమ గోల్‌కీపర్ ఎవరు? అన్నింటికీ మించి.. విశ్వవిజేతగా నిలిచే జట్టు ఏది? అర్జెంటీనా తన కిరీటాన్ని కాపాడుకుంటుందా? బ్రెజిల్ తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా? లేక ఈసారి ప్రపంచం ఊహించని సరికొత్త ఛాంపియన్ అవతరిస్తాడా? ఈ ప్రశ్నలన్నింటికీ మరో 20 రోజుల్లో సమాధానం దొరకనుంది.
Read Also: ఒలింపిక్స్ లో క్రికెట్.. మన అమ్మాయిలకు డైరెక్ట్ ఎంట్రీ!
Follow Us On: Instagram

