కలం, జోగులాంబ గద్వాల: ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం కేటి దొడ్డి మండలం కొండాపురం (Kondapuram) గ్రామంలో యువతలో రోడ్డు భద్రత, వాహన నియంత్రణపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా యువత ఆధ్వర్యంలో “స్లో బైక్ రేసింగ్ (Slow Bike Racing)” పోటీలను అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించారు. ఈ పోటీలలో సాధారణ రేసింగ్‌కు భిన్నంగా ఎవరు కింద కాలు పెట్టకుండా, బైక్ ఇంజన్ ఆపకుండా, అత్యంత నెమ్మదిగా గమ్యస్థానాన్ని చేరుకుంటారనే నిబంధనను విధించారు.
ఈ వినూత్న పోటీలో పాల్గొనేందుకు స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బైక్‌పై పట్టు, శారీరక సమతుల్యత, మానసిక ఏకాగ్రతను పరీక్షించేలా సాగిన ఈ పోటీలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. “నేటి యువత వేగంగా బైక్‌లు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వేగం కంటే వాహనంపై నియంత్రణ, ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో తెలియజెప్పడానికే ఈ స్లో బైక్ రేసింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. యువత రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పాల్గొన్నారు.

