కలం, కరీంనగర్ బ్యూరో : యువత చదువుకునే దశలో డ్రగ్స్ (Drugs) జోలికి పోకుండా మంచి మార్గంలో నడవాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసిందని మంత్రి పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. యువతే దేశ భవిష్యత్తు అని, లక్ష్యాలను సాధించడమే ప్రధానంగా భావించాలని చెప్పారు.
తల్లిదండ్రుల ఆశలు, నమ్మకాలను నిలబెట్టేలా ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి (Minister Adluri) పిలుపునిచ్చారు. “ఒక్కసారి మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది” అనే నిర్లక్ష్య ధోరణే జీవితాన్ని నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు బానిసైన తర్వాత దాని నుంచి బయటపడటం చాలా కష్టమని ఆయన హెచ్చరించారు. కళాశాలలు, విద్యాసంస్థలు లేదా పరిసర ప్రాంతాలలో డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. అనుకోకుండా మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్‌ల ద్వారా వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాంటి వారు సంకోచం లేకుండా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే “నషా ముక్త్ భారత్” పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Read Also: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నిధులు విడుదల
Follow Us On: Instagram

