కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఎస్ఎఫ్ఐ (SFI) రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ దుయ్యబట్టారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కరీంనగర్ (Karimnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ముకుందల మిశ్రా భవన్లో జిల్లా వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పూర్తిస్థాయిలో అందించలేదని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే యూనిఫాంలు అందిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు.
4 వేలకే స్కూళ్లు పరిమితం చేసే ప్రయత్నం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యారంగంపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అనేక మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ సరిగా జరగడం లేదని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్ని సంస్థలకు అప్పగించడం వల్ల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం అందుతోందని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని, వాటిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రీయింబర్స్మెంట్ చెల్లించేవరకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, బోగేష్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, అనిల్, సిద్దిక్, అనిల్, నాయకులు పాల్గొన్నారు.

