కలం, సినిమా : టాలీవుడ్లో ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) సినిమా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదంపై సీనియర్ నటుడు నరేశ్(Actor Naresh) స్పందించారు. కొంతమంది ఈ టైటిల్ను అనవసరంగా పెద్ద సమస్యగా మారుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు భాషలోని తెలంగాణ మాండలికంను కొందరు తప్పుగా ప్రదర్శిస్తూ వివాదం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా వైవిధ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, తెలుగు భాషలోని ప్రతి మాండలికంకు గొప్ప చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉందని నరేశ్ గుర్తు చేశారు.
‘కరుప్పు’, ‘కాంతార’ వంటి పదాల అర్థాలు తెలియకపోయినా ఆ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. అలాగే భాషల పేరుతో వివాదాలు సృష్టించడం అవసరం లేదని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు రాజకీయంగా, భౌగోళికంగా వేరుగా ఉన్నా ఒక్కటేనని, “మనమంతా ఒకే రక్తం — తెలుగు” అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్న సమయంలో మనమే మన భాషను దెబ్బతీయడం సరికాదని హెచ్చరించారు. ఈ అంశాన్ని ‘తెలుగు భాషా సంఘం’ పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.

