కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక (Nellipaka) గ్రామ సమీపంలో క్షుద్ర పూజల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. గోదావరి తీరంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ భయంకరమైన రీతిలో పూజలు నిర్వహించినట్లు వెలుగుచూడటంతో, గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లిపాక గ్రామ సమీపంలోని గోదావరి ఒడ్డున ఇసుకలో ఒక పెద్ద గుండం గీసి, దాని చుట్టూ ఇనుప మేకులు కొట్టి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లడంతో పాటు నాలుగు కోళ్లను, ఒక మేకను బలి ఇచ్చి, వాటి కళేబరాలను ఆ గుండంలోనే వదిలేసి వెళ్లారు. ఉదయాన్నే గోదావరి తీరానికి వెళ్లిన గ్రామస్థులకు ఈ భీతావహ దృశ్యాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
తమ గ్రామంలో ఇలాంటి క్షుద్ర పూజలు జరగడం ఇదే మొదటిసారి అని, ఈ ఘటనతో తామంతా తీవ్ర భయాందోళనల మధ్య గడపాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన గోదావరి నది ఒడ్డున అర్ధరాత్రి వేళ ఈ పూజలు నిర్వహించింది ఎవరనే కోణంలో స్థానికుల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు, పోలీసులు తక్షణమే దృష్టి సారించి, సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను త్వరగా గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి అసాంఘిక పనులు పునరావృతం కాకుండా గోదావరి తీరంలో నిఘా పెంచాలని కోరుతున్నారు.

