కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ (Hyderabad Food Safety) అధికారులు చేస్తున్న తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లు అయిన మెహెఫిల్, షాగౌస్, పాలమూరు గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్, పలు రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా ఉన్న షా ఘౌస్ రెస్టారెంట్లో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ బృందాలు చేసిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనిఖీల్లో వంటగది గోడలపై గుట్కా మరకలు, ఆహార పదార్థాలు చుట్టూ ఈగలు, పరిశుభ్రత లోపం, గ్రీజ్, దుమ్ము పేరుకుపోవడం, అపరిశుభ్రమైన నాన్‌వెజ్ కటింగ్ ఏరియా, తెరిచి ఉన్న డ్రైన్లు, ఆహార వ్యర్థాలు, లేబుళ్లు లేని సెమీ-ప్రిపేర్డ్ ఫుడ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హైజీన్ రేటింగ్‌లో ఈ రెస్టారెంట్‌కు 65 శాతం స్కోర్ రావడంతో యాజమాన్యానికి నోటీసులు అందజేశారు.
మెహెఫిల్‌లో గ్రిల్ చికెన్ నిల్వలు..
ఇక నగరంలోకి ఫేమస్ రెస్టారెంట్ మెహెఫిల్‌లో ఫుడ్ చెకింగ్ చేసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మెహెఫిల్‌లో అపరిశుభ్రమైన వాతావరణం, తడి ఫ్లోర్, గ్రిల్ చికెన్ నిల్వలు, నిర్మాణ సామాగ్రి పక్కనే రుమాలీ రోటీల తయారీ వంటి దృశ్యాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. వంటగది స్థలం అపరిశుభ్రంగా ఉండటం, ఆరోగ్య సర్టిఫికెట్లు లేకపోవడం వంటి లోపాలపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 68/102 (67%) మార్కులు సాధించిన రెస్టారెంట్‌కు మెరుగుదల నోటీసు జారీ చేశారు.
వంటగదిలో అపరిశుభ్రత
కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డేట్ ఎక్స్ పైరీ అయిన మష్రూమ్స్, పాత ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో అపరిశుభ్రత, తుప్పు పట్టిన ఫ్రీజర్లు, రెస్టారెంట్ అంతా అపరిశుభ్రంగా ఉండటం, శానిటైజేషన్ లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. ఆహార నాణ్యత నిబంధనల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
బిర్యానీకి ఒక బ్రాండ్ నిలిచిన హైదరాబాద్… ఫుడ్ హైజీన్‌లో మాత్రం దేశంలోని మెట్రో నగరాలన్నింటికీ చివరలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన 75 వేల ఫుడ్ ఔట్లెట్లలో కేవలం 361 రెస్టారెంట్ లకే హైజీన్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.ఫేమస్ బిర్యానీ సెంటర్లలో నాణ్యతా ప్రమాణాలపై హైదరాబాద్ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

