Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

కలం, నల్లగొండ : సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన (CM Revanth Reddy Nalgonda Tour) నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. శనివారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లు కలిసి సీఎం పర్యటించనున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో మరోసారి నిశితంగా పరిశీలించారు. కనగల్ మండలం, నల్లగొండ పట్టణంలోని ఎన్.జి. (నాగార్జున) ప్రభుత్వ కళాశాల గ్రౌండ్‌లో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను వారు స్వయంగా పర్యవేక్షించారు.

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత కనగల్‌లో రూ. 13,006 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ‘హ్యాం’ రోడ్డు పనుల శంకుస్థాపన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం నల్లగొండ పట్టణానికి చేరుకుని, ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా సీఎం ఆవిష్కరిస్తారు.

సభా స్థలి వద్ద విఐపి గ్యాలరీ, మహిళల కేటగిరీ, సాధారణ సీటింగ్, బారికేడ్ల నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎండ తీవ్రతను, అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షం వచ్చినా తట్టుకునేలా జర్మన్ టెంట్లు వేయాలని సూచించారు. సభకు వచ్చే ప్రజల కోసం తాగునీరు, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఎక్కడా జాప్యం జరిగినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

ట్రాఫిక్ రూట్ మ్యాప్ ఇదే : ఎస్పీ శరత్ చంద్ర పవార్

ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా నల్లగొండ టౌన్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. తిప్పర్తి తదితర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు పానగల్ రోడ్డు మీదుగా రావాల్సి ఉంటుంది.

దేవరకొండ వైపు నుండి వచ్చే వాహనాలను నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక వైపు నుండి మళ్లిస్తారు. మర్రిగూడ బైపాస్ వైపు నుండి వచ్చే వాహనాలు ఎన్జీ కళాశాల వద్దకు చేరుకుని యూటర్న్ తీసుకుని, ప్రజలను దించిన తర్వాత కేటాయించిన పార్కింగ్ స్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డిలతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>