Mobile Popup Ad
Mobile Popup Ad

శుభకార్యాల్లో మిగిలిన ఆహరం.. నాణ్యత పరిశీలించాలని కలెక్టర్ ఆదేశం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో పెండ్లిళ్లు, శుభకార్యాలు, విందు, సామూహిక భోజనాల అనంతరం మిగిలిపోయిన ఆహారాన్ని స్వీకరించే ముందు దాని నాణ్యత, తాజాదనం, పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Mahabubnagar Collector) శనివారం ప్రజలకు సూచించారు.

ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిగిలిన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. వేడుకల అనంతరం మిగిలిన ఆహారాన్ని కొందరు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సేవా సంస్థలు అవసరమైన వారికి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో, ఆహారం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు.

పరిశీలించిన తర్వాతే పంపిణీ..

ఆహారం తయారైన సమయం, నిల్వ చేసిన విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, రవాణా పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత మాత్రమే పంపిణీ చేసి వినియోగించాలని సూచించారు. ఎక్కువసేపు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచిన ఆహారం త్వరగా కలుషితమై ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇలాంటి ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సేవా కార్యక్రమాల పేరుతో పంపిణీ చేసే ఆహారం తప్పనిసరిగా పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ చేసి, సురక్షితమైన పరిస్థితుల్లో తరలించాలని, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్వాహకులకు కలెక్టర్ (Mahabubnagar Collector) సూచించారు. ఆహారం వాసన, రంగు, రుచి లేదా నాణ్యతలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే దానిని వినియోగించకుండా పారవేయాలని చెప్పారు.

ప్రజలకు ముఖ్య సూచన

ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్న జిల్లా కలెక్టర్, ప్రతి ఒక్కరూ ఆహార భద్రతా నిబంధనలు పాటించి సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్నే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శుభకార్యాల నిర్వాహకులు, క్యాటరింగ్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహార పంపిణీలో పూర్తి బాధ్యతతో వ్యవహరించి ఆహార వ్యర్థాలను తగ్గించడంతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ఎన్ని పులులు ఉన్నాయంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>