Mobile Popup Ad
Mobile Popup Ad

పొదుపు సంఘాల నుంచి పవర్ ప్లాంట్ నిర్వాహణ దాకా.. ఖమ్మం మహిళల సత్తా

కలం, ఖమ్మం బ్యూరో : నిన్నటివరకు పొదుపు సంఘాల్లో వందలు, వేలు దాచుకుంటూ ఇల్లు గడిచేందుకు ఆసరాగా నిలిచిన సాధారణ గ్రామీణ మహిళలు.. నేడు పారిశ్రామికవేత్తలుగా మారి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన “ఇందిరా మహిళా శక్తి” పథకం ద్వారా ఖమ్మం (Khammam) జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం దేశంలోనే తొలిసారిగా మహిళా స్వయం సహాయక సంఘాల (SHG Women) ఆధ్వర్యంలో ఒక మెగావాట్ (1,000 కిలోవాట్స్) భారీ సోలార్ పవర్ ప్లాంట్‌ (Solar Power Project) ను ప్రారంభించింది. అంతే కాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో ప్రారంభం చేయించింది.

క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త వేదికగా నిలిచారు. సోలార్ ప్రాజెక్టును కార్పొరేట్ స్థాయి పర్యవేక్షణకు అవసరమైన గ్రిడ్ ఆధారిత ప్లాంట్‌ను మహిళా సంఘాల ప్రతినిధులే స్వయంగా టెక్నికల్ మేనేజర్లుగా మారి విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా వచ్చే లాభాలను మహిళా సంఘాల సభ్యుల కుటుంబాల ఆర్థిక అవసరాలకు, పిల్లల ఉన్నత చదువులకు, ఆరోగ్య సంరక్షణకు జీవనోపాధి కోసం రుణాల రూపంలో అందించనున్నారు.

విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థతో అధికారికంగా ఒప్పందం కుదిరింది. ఒక్కో యూనిట్‌కు రూ. 3.13 చొప్పున అమ్మడం ద్వారా రోజుకు రూ. 14,085 చొప్పున, నెలకు రూ. 4.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అన్ని రకాల నిర్వహణ ఖర్చులు, బ్యాంక్ లోన్ వాయిదాలు పోను నెలకు రూ. 2 లక్షల నికర లాభం వస్తుంది.

థర్మల్, హైడల్ ప్రాజెక్టులతో పోలిస్తే సోలార్ ప్లాంట్ల నిర్వహణ వ్యయం చాలా తక్కువ కావడం, పైగా ప్లాంట్ దాదాపు 24 ఏళ్లపాటు నిరంతరాయంగా పనిచేయనుండటంతో మహిళ సంఘాలకు రెండు దశాబ్దాల పాటు ఆర్థిక భద్రత లభించినట్లైంది. ఇక్కడి సక్సెస్ స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భూసేకరణ ప్రక్రియను సర్కారు వేగవంతం చేసింది. తెలంగాణలో మహిళా సంఘాల ద్వారా రాబోయే రోజుల్లో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి వెంకటాపురం ప్రాజెక్ట్ ‘పైలట్ మోడల్’ గా నిలిచిందనడంలో సందేహం లేదు.

దీని గురించి ఎర్రుపాలెం చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి మట్లాడుతూ.. “ఏడాది కింద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించాం. గత నెల 27న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్లాంట్‌ను ఓపెన్ చేశారు. మొన్నటి వరకూ సాయి బాబుజీ సోలార్ కంపెనీ నిర్వహణ చూసింది. గత వారమే మా సంఘం చేతికి వచ్చింది. ప్లాంట్ నిర్వహణపై కంపెనీ వాళ్లు వారం పాటు ట్రైనింగ్ ఇచ్చారు. సాధారణ గృహిణిల స్థాయి నుంచి పవర్ ప్లాంట్ నిర్వహించుకునే స్థితికి చేరడం చాలా గర్వంగా ఉంది. రెండున్నర కోట్ల రూపాయల ప్రాజెక్టును నేను రన్ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏడేళ్లలో రుణం తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని అన్నారు.

మహిళా సంఘాలు.. సోలార్ ప్లాంటు.. ఉత్పత్తి

ఎర్రుపాలెం ‘చైతన్య’ మధిర ‘వెలుగు’ మండల మహిళా సమాఖ్యలకు చెందిన 1,190 సంఘాల్లోని సుమారు 11,000 మంది సభ్యులకు ప్రభుత్వం 4 ఎకరాల భూమి కేటాయించారు. రూ. 2.84 కోట్లతో సోలార్ ప్లాంట్‌ను నిర్మించగా.. ఇందులో ప్రభుత్వం రూ. కోటి సబ్సిడీని ఇవ్వగా.. మిగిలిన రూ. 1.54 కోట్లను సెర్ప్, స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రుణం అందించారు. మొత్తం పెట్టుబడిలో మహిళా సంఘాలది 10 శాతం మార్జిన్ మనీ. ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన 2,002 సోలార్ ప్లేట్ల ద్వారా రోజుకు సుమారు 4,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>