కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ (SIR) లాంఛనంగా ప్రారంభమైనా కొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. హైదరాబాద్ నగరంలో ఎన్యూమరేషన్ ఫారాలు ఇంగ్లిషులో ముద్రించినవి అవసరానికి సరిపడా లేకపోవడంతో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇండ్ల విజిట్ చేయడానికి పరిమితులు విధించుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులోని 14 గ్రామాల ప్రజలు ‘సర్’ ప్రక్రియనే ప్రజలు అడ్డుకున్నారు. మహారాష్ట్రతో సరిహద్దు (Telangana Maharashtra Dispute) ఉన్నందున గ్రామాల రెవెన్యూ పరిధి ఏ రాష్ట్రానికి చెందినదో తేల్చాలని వారు పట్టుబడుతున్నారు.
తొలుత ఆ విషయం తేలిస్తేనే ఆ తర్వాత ‘సర్’ ప్రక్రియలో తమ వివరాలను ఇస్తామని షరతు విధించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డబుల్ పన్నులు వసూలు చేస్తున్నాయని, ఇంతకూ తాము ఏ రాష్ట్రానికి చెందినవారనేది తేలితే ఆ తర్వాత ఓటు హక్కు గురించి ఆలోచిస్తామన్నారు. ఒకవైపు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కెరిమిరి మండలం, మరోవైపు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకా సరిహద్దులుగా ఉన్నాయని వివరించారు. పరిపాలనాపరమైన అంశాలు తేలకపోవడంతో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్ పడింది.
రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లుగా..
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూరా తాలూకా సరిహద్దుల్లో ఉన్న 14 గ్రామాల ప్రజలు ‘సర్’ ప్రక్రియను అడ్డుకున్నారు (SIR Dispute). ఇంతకాలం వీరు రెండు రాష్ట్రాల ఓటర్లుగా కొనసాగారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇరువైపులా ఓట్లు వేశారు. ఇప్పుడు ‘సర్’ ప్రక్రియలో ఏదో ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలనే నిబంధనతో పరందోళి, ముకందగూడ, భోలాపటార్, అంతాపూర్, కోటా, లేండిగూడ, శంకర్‌లొద్ది, మహరాజ్‌గూడ పంచాయతీల పరిధిలోని 14 గ్రామాల ప్రజలు స్పష్టమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు ఉంచుకోవాలని, రెండోచోట తొలగించుకోవాల్సిందేనంటూ తెలంగాణ బూత్ లెవల్ ఆఫీసర్లు వారికి వివరించారు. రెండు చోట్లా ఓటు ఉంటే చట్టప్రకారం శిక్షలు తప్పవన్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడానికి ప్రయత్నించిన బీఎల్వోలు, వారి వెంట వచ్చిన సూపర్‌వైజర్లకు స్థానికుల డిమాండ్‌తో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు.
కలెక్టర్లు వచ్చి తేల్చిన తర్వాతే!
“అసలు మాది ఏ రాష్ట్రమో అధికారికంగా తేల్చండి. ఆ తర్వాతే ‘సర్’ సంగతి చూస్తాం. అది తేలిన తర్వాతనే ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుంటాం..” అని బీఎల్వోలు, సూపర్‌వైజర్లకు ఆయా గ్రామాల ప్రజలు స్పష్టంచేశారు. దాదాపు యాభై ఏండ్లుగా ఈ 14 గ్రామాల ప్రజలు సరిహద్దు వివాదంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సరిహద్దు గ్రామాల్లోని ప్రజల్లో దాదాపు 75% మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. తెలంగాణ ఏర్పడేంతవరకూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యవసాయం చేసుకున్నామని, ప్రభుత్వం తమ భూములకు పహాణీలు (పట్టాలు) ఇస్తుందని ఆశించామని, ఇప్పటికి పన్నేండేండ్లు అయినా అందలేదని ఈ గ్రామాల ప్రజలు వాపోయారు.
ఈ మధ్య అటవీ శాఖ అధికారులు వచ్చి ఈ భూములన్నీ రిజర్వు ఫారెస్టు పరిధిలోకి వస్తాయంటూ కొత్త భయం పుట్టించారని గ్రామాల ప్రజలు తెలిపారు. మొక్కలు నాటుతామంటూ ఇంతకాలం తమ సాగులో ఉన్న భూములపై పెత్తనం చేస్తున్నారని, చిన్నా చితకా సాగు పనులను కూడా అడ్డుకుంటున్నారని చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారులు ప్రతి సంవత్సరం వచ్చి పన్నులు వసూలు చేస్తుననారని, డబుల్ పన్నులు కడుతూనే ఉన్నామని వారు తెలిపారు. కరెంట్ బిల్లులు కూడా రెండు రాష్ట్రాలకు కట్టాల్సి వస్తున్నదన్నారు.
డబుల్ పన్నులు వసూలు చేస్తున్న అధికారులు ఎప్పుడూ ఈ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చలేదని, ఇప్పుడు ఒకే ఓటర్ కార్డ్ అని చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు వాపోయారు. ఒకే చోట ఓటు ఉంచుకోడానికి తాము సిద్ధమేనని, కానీ పన్నులు కూడా ఒకే రాష్ట్రానికి కడతామని, ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తామో కలెక్టర్లు వచ్చి తేల్చాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: ఆ డైరీలో ఏముంది? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన డైరీ పేజీలు
Follow Us On: Sharechat


