కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. రేణుక అక్షర మహిళా మండలి (Mahila Mandali) అధ్యక్షురాలు పూనెం సరోజ ఆరోపించారు. శుక్రవారం మణుగూరులో మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో స్కూల్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా, పుస్తకాలు, యూనిఫాంలు, షూస్, స్కూల్ బ్యాగులను కూడా పాఠశాలల ద్వారానే తప్పనిసరిగా కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని విమర్శించారు. దీంతో ముఖ్యంగా పేద, గిరిజన కుటుంబాలపై వేల రూపాయల అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార కరపత్రాలలో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రచారం చేస్తూ, వాస్తవానికి పాఠశాలలలో కనీస మౌలిక వసతులు కూడా లేకుండా అధికారులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే వాటి గుర్తింపును రద్దు చేయాలని కోరారు. పిల్లల భవిష్యత్తును పెట్టుబడిగా మార్చుకున్న విద్యా మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట దశలవారీగా ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి ప్రతినిధులు ఎండి షబానా, బొడ్డు సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

