Mobile Popup Ad
Mobile Popup Ad

షఫాలీ పోరాటం.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

కలం, వెబ్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ (India) తన హవాను కొనసాగిస్తోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ కమ్‌బ్యాక్ చాలా గట్టిగా ఉంది. ఈ క్రమంలోనే మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఫీల్డింగ్‌లో లోపాలు ఉన్నప్పటికీ పరుగులను కట్టడి చేయడంలో అమ్మాయిలు అదరగొట్టారు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో కూడా తమ సత్తా చాటారు. బౌలింగ్‌లో రాధా రఫ్ఫాడిస్తే బ్యాటింగ్‌లో షఫాలీ తన సత్తా చాటారు. బంగ్లాదేశ్ ఇచ్చిన 137 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్ల నష్టానికే అధిగమించింది. 17 ఓవర్లలో ఛేజింగ్‌ను ముగించేశారు భారత సివంగులు.

షాక్ ఇచ్చిన భారత బౌలర్లు..

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టుకు భారత బౌలర్లు గట్టి షాకిచ్చారు. ఓపెనర్ డిలారా అక్తెర్ కేవలం 4 పరుగులకే రేణుక సింగ్ బౌలింగ్‌లో శ్రీ చరణికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత మరో ఓపెనర్ జువైరియా ఫెర్దౌస్ 31 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసి నందని శర్మ బౌలింగ్‌లో ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటైంది. మిడిల్ ఆర్డర్‌లో శోభన మోస్తరి (26 బంతుల్లో 22, 2 ఫోర్లు) కాసేపు నిలబడగా, కెప్టెన్ నిగర్ సుల్తానా 27 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేసి రాధా యాదవ్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన శర్మిన్ అఖ్తర్ (10) రిటైర్డ్ అవుట్‌గా వెళ్లగా, షోర్నా అక్తెర్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి శ్రీ చరణి బౌలింగ్‌లో అవుటైంది. రీతు మోని 4 బంతుల్లో 1 ఫోర్‌తో 8 పరుగులు చేయగా, రాబేయా ఖాన్ 2, మరో బ్యాటర్ మరుఫా అక్తెర్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నహిదా అక్తర్ డకౌట్ అయింది. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.

రాధా యాదవ్ అద్భుత ప్రదర్శన..

భారత బౌలర్లలో రాధా యాదవ్ అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణి కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 2 వికెట్లు సాధించింది. రేణుక సింగ్ 3 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఒక వికెట్, నందని శర్మ 3 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. ఇక దీప్తి శర్మ వికెట్ తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వగా, షఫాలీ వర్మ వేసిన 2 ఓవర్లలో 11 పరుగులు వచ్చాయి.

ఎదురుదాడి చేసిన షఫాలీ వర్మ..

137 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ స్మృతి మంధాన (6 బంతుల్లో 8, 1 ఫోర్) రూపంలో తొలి ఓవర్లలోనే షాక్ తగిలింది. మరుఫా అక్తర్ బౌలింగ్‌లో ఆమె అవుటైంది. అయితే మరో ఓపెనర్ షఫాలీ వర్మ బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. కేవలం 34 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 భారీ సిక్సర్‌తో 53 పరుగులు చేసి నహిదా అక్తర్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయింది. ఆ తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ యాస్తికా భాటియా 18 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసి రీతు మోని బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. మిడిల్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ రిచా ఘోష్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి రాబేయా ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ (lbw) అయింది. ఆ వెంటనే జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26 పరుగులు చేసి రీతు మోని బౌలింగ్‌లోనే అవుటైంది. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (14 బంతుల్లో 13 నాటౌట్), దీప్తి శర్మ (2 బంతుల్లో 5 నాటౌట్) క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ముగించారు. భారత్ 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

బంగ్లాదేశ్ బౌలర్లలో రీతు మోని 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, రాబేయా ఖాన్ 3 ఓవర్లలో 19 పరుగులకు ఒక వికెట్, నహిదా అక్తెర్ 3.5 ఓవర్లలో 24 పరుగులకు ఒక వికెట్ పడగొట్టారు. మరో బౌలర్ మరుఫా అక్తెర్ 3 ఓవర్లలో 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకోగా, సంజిదా అక్తెర్ మేఘ్ల 3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి ఎలాంటి వికెట్ సాధించలేకపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>