కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండి విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Malkajgiri Government College) మాత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. దోస్త్ అడ్మిషన్ల మూడో విడత పూర్తయ్యే సరికి కళాశాలలోని వంద శాతం సీట్లు ఫుల్ అయ్యాయి. నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలే ఈ విజయానికి కారణమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రాజు తెలిపారు.
గత మూడు సంవత్సరాలుగా మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నాయని ప్రిన్సిపాల్ వెల్లడించారు. 2024 విద్యా సంవత్సరంలో 360 మంది, 2025లో 499 మంది విద్యార్థులు చేరగా, 2026–27 విద్యా సంవత్సరానికి మొత్తం 600 సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. బీఏలో 120 మంది, బీకామ్‌లో 240 మంది, బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో 120 మంది, బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 120 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని వెల్లడించారు. అలాగే తాను ఇన్చార్జిగా ఉన్న కుత్బుల్లాపూర్ డిగ్రీ కాలేజీలో కూడా ఈ ఏడాది వందశాతంసీట్లు భర్తీ అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు.
కళాశాలలో సీనియర్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లతో బోధన, నైపుణ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, జాబ్ మేళాలు, క్యాంపస్ ప్లేస్మెంట్ అవకాశాలు నిరంతరం కల్పిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. దీంతో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ కళాశాలను మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. 100 శాతం ప్రవేశాలు పూర్తి కావడం కళాశాల చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిందని డాక్టర్ బండి రాజు అన్నారు. ఈ ఘనత అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సమిష్టి కృషి ఫలితమని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తూ, విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

