కలం, వనపర్తి: ప్రస్తుతం నీళ్లు వస్తున్నాయని తొందరపడి వరి సాగు చేసి.. తర్వాత నీటి కోసం ఇబ్బందులు పడొద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రైతులకు సూచించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రానున్న రెండు నెలల్లో ఇది మరింత పెరిగి వర్షాలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. రైతులు ముందుచూపుతో ఆరుతడి, పామాయిల్, కూరగాయల పంటల వైపు మళ్లాలని సూచించారు.
మంగళవారం పెద్దమందడి రైతువేదికలో ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు నాటికి పెద్దమందడి మండలంలో 100 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదవగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 76 సెం.మీ. మాత్రమే నమోదైందన్నారు. గతేడాది 22 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. అందులో 18 వేల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. ఈ ఏడాది వరికి సరిపడా నీరు అందే పరిస్థితి ఉండకపోవచ్చని, భూగర్భ జలాలు సైతం తగ్గుతున్నాయని హెచ్చరించారు.
ఆరుతడితో ముందుకు..
పెద్దమందడి రైతులు వేరుసెనగ, మినుములు, కూరగాయలు, పామాయిల్ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకుని ఇతర మండలాలకు మార్గదర్శకంగా నిలవాలని కలెక్టర్ కోరారు. ఆరుతడి పంటలకు మేలురకం, లాభదాయకమైన విత్తనాలను అందించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.
పామాయిల్‌కు భారీగా సబ్సిడీ..
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ పామాయిల్ సాగును ప్రభుత్వం భారీ సబ్సిడీతో ప్రోత్సహిస్తోందన్నారు. ఒక ఎకరా వరికి వినియోగించే నీటితో మూడు ఎకరాల్లో పామాయిల్ సాగు చేయవచ్చన్నారు. ఎకరానికి ఐదు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పామాయిల్ సాగు చేస్తున్న కొందరు రైతులు నెలకు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు. కూరగాయల సాగుకు ఎకరానికి రూ.9,600 వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు.
వరికి బోనస్ ఇస్తే.. ఆరుతడికి ఎందుకు?
రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఆరుతడి పంటలే ఎక్కువగా సాగు చేసేవారని, సాగునీటి విస్తరణతో రైతులు వరి సాగుకు అలవాటు పడ్డారని తెలిపారు. వరికి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రైతులు ఇతర పంటల వైపు ఎందుకు మళ్లుతారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆరుతడి పంటలకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడంతో పాటు వాటికీ బోనస్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పర్ణిత, మండల వ్యవసాయ అధికారి సైదులు, సర్పంచి సూర్యగంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ సత్యారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

