కలం, వెబ్ డెస్క్: సిద్దిపేట (Siddipet) జిల్లాలో వచ్చే ఏడాది జులై నాటికీ సాగు, త్రాగు నీటి కొరత లేకుండా చూడాలని అధికారులను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని.. మిడ్ మానేరులో సరిపడా నీళ్లను నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఇరిగిషన్ అడ్వైజరి కమిటీకి లేఖ రాశారు. రిజర్వాయర్ల దుస్థితి చూస్తే దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ప్రారంభించలేదు..
మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశం సందర్బంగా ఆయన బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగంగా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నిర్మించుకున్నామని తెలిపారు. ప్రతీఏటా ఈ సమయం వరకే రిజర్వాయర్లలోకి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి నీటిని ఎత్తిపోయడం జరిగేదని.. కానీ ఈసారి ఇంకా ఎత్తిపోతలు ప్రారంభించలేదని పేర్కొన్నారు.
డెడ్ స్టోరేజిలో ఉన్నాయి..
ప్రస్తుతం అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు డెడ్ స్టోరేజిలో ఉన్నాయని.. వీటిని వెంటనే నింపాల్సి ఉందని ప్రస్తావించారు. కొమురవెళ్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు అడుగంటే పరిస్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్లలోకి తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నింపాలని కోరారు. దీని వల్ల భూగర్భ జలాలు పెరిగి ఈ వానాకాలం పంటల సీజన్ లో జిల్లాలోని రైతులకు ప్రయోజనంగా ఉంటుందని చెప్పారు. గోదావరిలో ప్రవాహం ఉన్నప్పుడే వడివడిగా నీటిని ఎత్తిపోస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. జిల్లాలోని రైతులకు ఏ కష్టం రాకుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

