కలం, వెబ్ డెస్క్: భూ భారతి కింద స్వీకరించిన దరఖాస్తులను నిర్దేశిత గడువు 60 రోజుల్లోగా పరిష్కరించాలని నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల సూపరింటెండెంట్లు, అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి విభాగానికి సంబంధించిన రికార్డులను క్రమం తప్పకుండా పరిశీలించి, ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు సక్రమంగా భద్రపరచాలని సూచించారు.
ఉద్యోగుల హాజరుపై నిరంతర పర్యవేక్షణ..
కలెక్టరేట్ ఉద్యోగుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని హెచ్చరించారు. ప్రతి విభాగం పరిధిలోని ఉద్యోగుల వివరాలు, పెండింగ్ అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

