8 వేల ఇండ్లు.. 35 వేల అప్లికేషన్లు

కలం, తెలంగాణ బ్యూరో: ‘క్యూర్’ పరిధిలో అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల (Urban Indiramma Houses) కు దరఖాస్తు చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనున్నది. గత నెల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో శనివారం సాయంత్రం నాటికి మొత్తం 35 వేలకు పైగా (సుమారు 35,125) దరఖాస్తులు వచ్చినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. అప్లై చేసుకోడానికి తుది గడువు ఆగస్టు 10గా ఖరారు చేయడంతో చివరి రోజున భారీ స్థాయిలో దరఖాస్తులు రావచ్చని ఆయన అంచనా వేశారు.

గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో చోట 500 చొప్పున ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 8వేల ఇండ్లు నిర్మించేలా అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం ఆహ్వానించింది. దరఖాస్తుతో పాటు రూ. 10 వేల చొప్పున డిపాజిట్ చెల్లించాలని షరతు విధించింది. దరఖాస్తుల్లో అర్హతలను స్క్రూటినీ చేసిన తర్వాత అర్హులను గుర్తించనున్నది. ఇండ్ల సంఖ్యకంటే దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించిన హౌసింగ్ బోర్డు బహిరంగ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది.

ఆ ప్రకారం మొత్తం 8వేల ఇండ్ల నిర్మాణానికి వీలుగా స్థలాన్ని గుర్తించింది. ఒకవేళ డిపాజిట్ కట్టినవారు లాటరీ ద్వారా ఎంపిక కాకపోతే వారికి తిరిగి రూ. 10 వేలు చెల్లిస్తామని కూడా వివరించింది. లాటరీలో ఎంపికైనట్లయితే మొత్తం కట్టాల్సిన రూ. 6 లక్షల్లో మినహాయిస్తామని తెలిపింది. మార్కెట్ రేటు ప్రకారం స్థలం ధర సుమారు 60 లక్షల వరకు ఉన్నా కేవలం రూ. 6 లక్షలకే ఇస్తున్నట్లు తెలిపింది. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం మూడు వాయిదాల్లో రూ. 5 లక్షలను చెల్లించనున్నది.

ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు..

1. ఖైరతాబాద్ – 4,394
2. అంబర్‌పేట్ – 2,357
3. బహదూర్‌పుర – 1,135
4. ఇబ్రహీంపట్నం – 749
5. కూకట్‌పల్లి – 5,233
6. కార్వాన్ – 1,574
7. మహేశ్వరం – 471
8. మలక్‌పేట్ – 2,846
9. మల్కాలజిగిరి – 1,033
10. మేడ్చల్ – 1,153
11. నాంపల్లి – 3,613
12. సనత్‌నగర్ – 1,046
13. కుత్బుల్లాపూర్ – 4,121
14. రాజేంద్రనగర్ – 1,469
15. కంటోన్మెంట్ – 1,374
16. శేరిలింగంపల్లి – 2,530
మొత్తం  –   35,125

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>