కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా, ‘దక్షిణ అయోధ్య’గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం (Bhadrachalam Temple) సమగ్ర పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్న ఈ మహత్తర అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన అధికారికంగా శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) ప్రకటించారు.
గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు, భద్రాచలం ఆలయ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవం, సాంస్కృతిక వారసత్వానికి ఎలాంటి భంగం కలగకుండా సాంప్రదాయ శిల్పకళ ఉట్టిపడేలా పూర్తి రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం క్షేత్రాన్ని ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగానే ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మహత్తర ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.351 కోట్ల భారీ నిధులను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వచ్చే శ్రీరామ నవమి నాటికి నిర్దేశిత పనులన్నీ పూర్తి చేయాలని, అందుకోసం పనులను వివిధ విభాగాలుగా విభజించి ఒకేసారి యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. భద్రాచలం ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే క్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

