కలం, వెబ్డెస్క్: తాడిపత్రి (Tadipatri) లో సోమవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు పోటాపోటీ ర్యాలీలకు సిద్ధమవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు పోలీసులు ఇరు పార్టీల ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. తాడిపత్రిలోని తన నివాసం నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో కలిసి బయలుదేరారు. అయితే ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు.
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ నిరసన ర్యాలీ చేయాలని భావించారు. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు కూడా ర్యాలీ చేయాలని నిర్ణయించాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రిలో తిరగాలంటే ధైర్యం ఉండాలని, తమవైపు చూడాలంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టాలని వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో టీడీపీ దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

