కలం, వరంగల్ బ్యూరో: ఖిలా వరంగల్ (Warangal) రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఓ అధికారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆ ఆఫీసర్ భూ అక్రమాలు(Land Scam) ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూ ఆక్రమణలకు సంబంధించి ‘6 కోట్ల సర్కారు భూమి స్వాహా’ పేరిట కలం దినపత్రిక బుధవారం ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. నిషేధిత జాబితాలోని 7.01 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్ కు ఓ అధికారి సహకరించిన తీరును కలం వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. బుధవారం ఈ వ్యవహరంపై అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి విచారణ ప్రారంభించారు. కాగా ఈ అధికారి గతంలో పని చేసిన చోట్ల కూడా అవినీతికి పాల్పడ్డ వ్యవహారాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తున్నది
ఖిలా వరంగల్ రెవెన్యూ పరిధిలో..
– ఈ అధికారి గతంలో రెవెన్యూశాఖలో పనిచేసినప్పుడు చేసిన అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2009 నుంచి 2019 వరకు ఉన్న పహాణి ప్రకారం.. ఖిలా వరంగల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 683లో పీ చిన్నమల్లయ్య పేరిట 5.32 ఎకరాలు, సర్వే నంబర్ 682లో బిల్ల రాజమల్లు పేరిట 6 గుంటలు, సర్వే నంబర్ 684లో బిల్ల అయిలయ్య పేరిట 34 గుంటలు, సర్వే నంబర్ 685లో బిల్ల హన్మంతు పేరిట 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది.
– వీరిలో పీ మల్లయ్య సంబంధికులు స్థానికంగా ఎవరూ లేరు. దీంతో భూరికార్డుల ప్రక్షాళనలో పాస్ బుక్ జారీ కాలేదు. కాగా పై నాలుగు సర్వే నంబర్లల్లో ఉన్న 5.32 ఎకరాలతోపాటూ మరికొంత భూమిని కలిపి మొత్తం 7.01 ఎకరాల భూమిని 22 మంది కలిసి సేల్ డీడ్ ద్వారా 2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు . సదరు 22 మందిని ‘అబ్జల్యూట్ ఓనర్’గా రికార్డుల్లో చూపించారు.
– ఈ డాక్యుమెంట్ ద్వారా మ్యుటేషన్ చేసి తమకు పాస్ బుక్స్ జారీ చేయాలని 8 మంది కొనుగోలు దారులు అప్పట్లోనే తహసీల్దార్ ను ఆశ్రయించారు. అప్పటి తహసీల్దార్ రెవెన్యూ రికార్డులు, పహాణి పరిశీలిస్తే 683లోని 5.32 ఎకరాల భూమి పి.మల్లయ్య పేరిట నమోదై ఉండటం.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఆయనతో సంబంధం లేని పేర్లు ఉండడంతో సదరు అమ్మకందారులు పీ మల్లయ్యకు వారసులు ఎలా అవుతారనే ప్రశ్న తలెత్తి మ్యుటేషన్ చేయలేదు. ఆ తర్వాత వరుసగా ముగ్గురు తహసీల్దార్లు మ్యుటేషన్ పెండింగ్ లో పెడితే ఆ తర్వాత వచ్చిన ఈ అధికారి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేసి, పాస్ బుక్స్ జారీ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల మౌనమెందుకు?
ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్, ఆర్డీఓ స్థాయిల్లో ఎక్కడా అభ్యంతరాలు నమోదు కాకపోవడం గమనార్హం. కోట్ల విలువైన భూమి విషయంలో అధికారులు ప్రదర్శించిన అసాధారణ వేగం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండొచ్చనే ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. తిమ్మాపూర్ పరిధిలోని సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి విచారణ చేపట్టడంతో, ఇదే అధికారి గతంలో క్లియర్ చేసిన ఇతర భూ ఫైళ్లపైనా దృష్టి పడింది. దీంతో మరిన్ని భూ అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ ఫైల్ ఎక్కడ..?
తిమ్మాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 188 వివాదాస్పద సీలింగ్ భూమి డిజిటల్ సైన్ పేరిట మ్యూటేషన్ చేసిన ఫైల్ ఎక్కడుంది? అనే విషయం రెవెన్యూ వర్గాల్లో కలవరం రేపుతోంది. వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి విచారణ నిమిత్తం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన క్రమంలో ఫైల్ అందుబాటులో లేదని తెలిసింది. అయితే సదరు అధికారి కావాలని ఆ ఫైల్ మాయం చేసి ఉంటాడని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ తిమ్మాపూర్ జీపీవో, క్లస్టర్ ఆర్ఐ, తహసీల్దార్ వేర్వేరుగా విచారించి స్టేట్ మెంట్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆర్డీవో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణ వెలువెత్తుతున్నాయి.
సీలింగ్ భూమి ఎపిసోడ్లో అంతా తానే అయి కథ నడిపించిందని ప్రచారం జరుగుతుంది. ఏం జరిగినా నేను చూసుకుంటానని అధికారులకు హామీ కూడా ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిగితేనే అవినీతి అక్రమంలో ఎవరి పాత్ర ఎంత ఉందో బయటపడే అవకాశం ఉంది. లేకపోతే భూ మాఫియా-అధికారుల కుమ్మక్కు ఆరోపణలు మరింత బలపడటమే కాకుండా, ప్రజలకు ప్రభుత్వ భూ రికార్డులపై ఉన్న విశ్వాసం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

