Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాల.. ఆర్థిక కార్యదర్శి ప్రశంసలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) సమీపంలోని ఎల్‌ఎండీ కాలనీలో జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలను రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సందర్శించారు. జిల్లా ప్రత్యేకాధికారిగా ఉన్న ఆయన కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ఇక్కడకు వచ్చారు. దివ్యాంగులకు విద్యనందించడం గొప్ప అదృష్టమని, వారికి నైపుణ్యాలను అందించి స్వావలంబన దిశగా తీర్చిదిద్దడం ప్రశంసనీయమన్నారు.

పాఠశాల ఆవరణలో సందీప్ కుమార్ సుల్తానియా, కలెక్టర్ చిత్రా మిశ్రా, ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. తరగతి గదులు, హాస్టల్, డైనింగ్ హాల్, వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పాఠశాల నిర్వహణ తీరు, విద్యార్థుల సంరక్షణ, పరిశుభ్రత, క్రమశిక్షణ, అందిస్తున్న సౌకర్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. మానసిక వికలాంగుల అభివృద్ధి కోసం ట్రస్ట్ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పాఠశాల కార్యకలాపాలు, విద్యార్థులకు అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న ఇబ్బందులను సందీప్ కుమార్ సుల్తానియా, కలెక్టర్ చిత్రా మిశ్రాకు వివరించారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. అనంతరం ట్రస్ట్ సభ్యులతో సమావేశమైన సందీప్ కుమార్ సుల్తానియా నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ హరిప్రసాద్, ఆర్డీవో షర్మిల, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>