Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్‌లో అక్రమాలు.. రెవెన్యూ అధికారి భూ లీలలెన్నో!

కలం, వరంగల్ బ్యూరో: ఖిలా వరంగల్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి చుట్టూ భూ అక్రమాల ఆరోపణలు (Warangal Land Scam) ముదురుతున్నాయి. గతంలో ఆయన పనిచేసిన ప్రాంతాల్లోనూ వివాదాస్పద భూ వ్యవహారాలు వెలుగుచూసినట్లు సమాచారం. తాజాగా తిమ్మాపూర్ పరిధిలోని సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి బుధవారం విచారణ ప్రారంభించడంతో, ఈ అధికారి వ్యవహరించిన పలు ఫైళ్లు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఖిలా వరంగల్‌లో 7.01 ఎకరాల భూమి మ్యూటేషన్ వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఏళ్ల తరబడి వివాదాస్పదంగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు ఒక్కసారిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మ్యూటేషన్ పూర్తి చేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ప్రచారం రెవెన్యూ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

యజమాని ఒకరు.. హక్కుదారులు ఇంకొకరా?

ఖిలా వరంగల్ రెవెన్యూ పరిధిలో 2009 నుంచి 2019 వరకు ఉన్న పహాణి ప్రకారం సర్వే నంబర్ 683లో పి.చిన్నమల్లయ్య పేరిట 5.32 ఎకరాలు, సర్వే నంబర్ 682లో బిల్ల రాజమల్లు పేరిట 6 గుంటలు, సర్వే నంబర్ 684లో బిల్ల అయిలయ్య పేరిట 34 గుంటలు, సర్వే నంబర్ 685లో బిల్ల హన్మంతు పేరిట 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. వీరిలో పి. మల్లయ్య పేరిట స్థానికంగా ఎవరూ లేరు. దీంతో భూరికార్డుల ప్రక్షాళనలో పాస్ బుక్ జారీ కాలేదు. కాగా, 4 సర్వే నంబర్లలోని మొత్తం 7.01 ఎకరాల భూమిని 22 మంది కలిసి మరో మందికి సేల్ డీడ్ ద్వారా 2019లో రిజిస్ట్రేషన్ చేశారు.

సదరు 22 మందిని ‘అబ్జల్యూట్ ఓనర్’గా చూపారు. ఈ డాక్యుమెంట్ ద్వారా మ్యుటేషన్ చేసి తమకు పాస్ బుక్స్ జారీ చేయాలని 8 మంది కొనుగోలు దారులు అప్పట్లోనే తహసీల్దార్ ను ఆశ్రయించారు. అప్పటి తహసీల్దార్ రెవెన్యూ రికార్డులు, పహాణి పరిశీలిస్తే 683లోని 5.32 ఎకరాల భూమి పి.మల్లయ్య పేరిట నమోదై ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఆయనతో సంబంధం లేని పేర్లు ఉండడంతో సదరు అమ్మకందారులు పి.మల్లయ్య కు వారసులు ఎలా అవుతారనే ప్రశ్న తలెత్తి మ్యుటేషన్ చేయలేదు. ఆ తర్వాత వరుసగా ముగ్గురు తహసీల్దార్లు మ్యుటేషన్ పెండింగ్ లో పెడితే.. ఆ తర్వాత వచ్చిన తహసీల్దార్ నిబంధనలకు విరు ద్ధంగా మ్యుటేషన్ చేసి, పాస్ బుక్స్ జారీ చేశారు.

అధికారుల మౌనం వెనుక ఏముంది?

ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్, ఆర్డీఓ స్థాయిల్లో ఎక్కడా అభ్యంతరాలు నమోదు కాకపోవడం గమనార్హం. కోట్ల విలువైన భూమి విషయంలో అధికారులు ప్రదర్శించిన అసాధారణ వేగం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండొచ్చనే ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.

 పెరిగిన అనుమానాలు

తిమ్మాపూర్ పరిధిలోని సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి విచారణ చేపట్టడంతో, ఇదే అధికారి గతంలో క్లియర్ చేసిన ఇతర భూ ఫైళ్లపైనా దృష్టి పడింది. దీంతో మరిన్ని భూ అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ ఫైల్ ఎక్కడ..?

తిమ్మాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 188 వివాదాస్పద సీలింగ్ భూమి డిజిటల్ సైన్ పేరిట మ్యూటేషన్ చేసిన ఫైల్ ఎక్కడుంది అనే విషయం రెవెన్యూ వర్గాల్లో కలవరం రేపుతోంది. వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి విచారణ నిమిత్తం ఖిలా వరంగల్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన క్రమంలో ఫైల్ అందుబాటులో లేదని తెలిసింది. అయితే సదరు అధికారి కావాలని ఆ ఫైల్ మాయం చేసి ఉంటాడని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ తిమ్మాపూర్ జిపిఓ, క్లస్టర్ ఆర్ఐ, తహశీల్దారును వేరు వేరుగా విచారించి స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆర్డీవో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణ వెలువెత్తుతున్నాయి.

సీలింగ్ భూమి ఎపిసోడ్ లో అంతా తానే అయి కథ నడిపించిందని ప్రచారం జరుగుతుంది. ఏం జరిగినా నేను చూసుకుంటానని అధికారులకు హామీ కూడా ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిగితేనే అవినీతి అక్రమంలో ఎవరి పాత్ర ఎంత ఉందో బయటపడే అవకాశం ఉంది. లేకపోతే భూ మాఫియా-అధికారుల కుమ్మక్కు ఆరోపణలు మరింత బలపడటమే కాకుండా, ప్రజలకు ప్రభుత్వ భూ రికార్డులపై ఉన్న విశ్వాసం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>