కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీని (PM Modi) ఇరాన్ ఆహ్వానించింది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమైనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆహ్వానం పంపారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ వెళ్లకపోవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా విదేశాంగ అధికారుల ద్వారా భారత్ తరఫున అధికారిక సందేశం పంపించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది.
5 రోజుల పాటు అంత్యక్రియలు..
గత ఫిబ్రవరిలో అమెరికా దాడిలో సుప్రీం లీడర్ ఖమైనీ (Khamenei) మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇరాన్ ఫ్రీజర్‌లో భద్రపరుస్తూ వస్తోంది. ప్రస్తుతం యుద్ధం శాంతించిన నేపథ్యంలో ఖమైనీకి తుది వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది. జులై 4వ తేదీ నుంచి అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెహ్రాన్‌లో దేశ ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. జులై 9వ తేదీన సుప్రీం లీడర్ స్వస్థలమైన మష్హద్‌లోని ఇమామ్ రెజా శ్రైన్ వద్ద అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రస్తుతం దేశ సుప్రీం లీడర్‌గా ఆయన కుమారుడు మొజ్తాబా ఖమైనీ ఉన్నారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram

