కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) బియ్యం అక్రమ విక్రయాల కేసులో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) పోలీసులు భారీ పురోగతి సాధించారు. రైస్ మిల్లల పేరుతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర మోసం చేస్తూ, సీఎంఆర్ బియ్యాన్ని అక్రమంగా బహిరంగ మార్కెట్లో విక్రయించిన ఇద్దరు రైస్ మిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మిల్లుల ద్వారా మొత్తం రూ. 158 కోట్ల ప్రభుత్వ సొమ్మును వీరు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది.
మంగళవారం సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామగుండం డీసీపీ భూక్యా రామ్ రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్ కు చెందిన బండారి మారుతి, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్కూరు గ్రామానికి చెందిన సౌఖ్యం అంజయ్య కలిసి సుల్తానాబాద్‌లో ‘సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్’ నిర్వహిస్తున్నారు. వీరు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థతో సీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా.. నిబంధనలను ఉల్లంఘించి భారీ అక్రమాలకు పాల్పడ్డారు.
2023-24 సంవత్సరానికి గాను ప్రభుత్వానికి మొత్తం 2,119.125 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. కానీ వీరు కేవలం 515.158 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన 1,603.967 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించి భారీ లాభాలు పొందారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 7 కోట్లు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా, రైస్ మిల్లుల పేరుతో బ్యాంకులనుంచి రుణాలు పొందేందుకు నిల్వల్లో ఉన్న ప్రభుత్వ ధాన్యాన్ని కూడా అక్రమంగా వినియోగించినట్లు అధికారులు గుర్తించారు.
కేవలం ఈ ఒక్క మిల్లుతోనే కాకుండా.. ప్రధాన నిందితుడు బండారి మారుతి గతంలో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహా సీఎంఆర్ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. శ్రీరాములపల్లిలోని ‘సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్’ ద్వారా రూ. 69 కోట్లు మోసం, కోరపల్లిలోని ‘మహాశక్తి ఇండస్ట్రీస్’ ద్వారా రూ. 62 కోట్లు మోసం, కాట్నపల్లిలోని ‘సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్’ ద్వారా రూ. 20 కోట్లు మోసాలకు పాల్పడ్డారు. మొత్తం కుంభకోణం విలువ రూ. 158 కోట్లుగా పేర్కొన్నారు.
రామగుండం డీసీపీ భూక్యా రామ్ రెడ్డి మాట్లాడుతూ “నిందితులు పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ధాన్యాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించడంతో పాటు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు ఆధారాలు లభించాయి. 2025లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 1,088.014 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత బయటపడింది. దీనిపై వివరణ కోరగా నిందితులు తప్పుడు సమాచారమిస్తూ కాలయాపన చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారులు పలుమార్లు గడువు ఇచ్చినా బియ్యం సరఫరా చేయకపోవడంతో కేసు నమోదు చేశాం. ప్రధాన నిందితుడు బండారి మారుతిపై గతంలో హత్య, హత్యాయత్నం, మోసం తదితర నేరాలకు సంబంధించిన పలు కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రభుత్వ ధాన్యం సీఎంఆర్ బియ్యం అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
కేసు నమోదైన అనంతరం నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కరీంనగర్‌లోని కట్టరాంపూర్ ప్రాంతంలోని ఓ జిమ్ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం అందడంతో సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్‌రావు ఆధ్వర్యంలోని పోలీస్ బృందం చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకుంది. నిందితులను సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ నిర్వహించారు. కేసులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ పొన్నమనేని రంజిత్‌రావు, ఎస్ఐలు చంద్రకుమార్, మధుకర్, మల్లేష్, సనత్‌రెడ్డి, ఎస్ఐ అశోక్‌రెడ్డి తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

