కలం, వెబ్ డెస్క్ : గణిత శాస్త్రంలో భారతదేశంలో నిష్ణాతులైన ఆర్యభట్ట, భాస్కరాచార్యుల తరువాత అంతటి ఘనతను సాధించింది శ్రీనివాస రామానుజన్ (Ramanujan) . 32 ఏళ్లు బతికినా ప్రపంచ విజ్ఞాన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. భారత్ కు గర్వకారణమైన రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో కుప్పుస్వామి, తల్లి కోమలతమ్మాళ్ దంపతులకు జన్మించారు. బాల్యంలోనే రామానుజన్ కి గణితంపై అసాధారణమైన ఆసక్తి కనిపించేది. అయితే ఇతర విషయాలపై ఆసక్తి లేకపోవడంతో చదువులో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, స్వీయ కృషితో గణితాన్ని లోతుగా అధ్యయనం చేశారు. పుస్తకాలు లేకపోయినా, స్వంత ఆలోచనలతో అనేక సూత్రాలు కనుగొన్నారు.
తక్కువ సమయంలోనే అనేక విజయాలు
ఆయన ప్రతిభను గుర్తించిన ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ రామానుజన్‌ను ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. అక్కడ ఆయన సంఖ్యల సిద్ధాంతం, అనంత శ్రేణులు, విభజన సిద్ధాంతం వంటి రంగాల్లో విలువైన పరిశోధనలు చేశారు. రామానుజన్ చేసిన ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రానికి గొప్ప మార్గదర్శకంగా నిలిచాయి. రామానుజన్ తక్కువ వయసులోనే అనేక విజయాలు సాధించారు. ఆయన ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎంపికయ్యారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన 1920లో, కేవలం 32 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. మరణపు అంచుల్లో ఉన్న సమయంలోనూ కలలుగా వచ్చిన వాటిని సిద్ధాంతాలుగా రచించాడు. ఆయన చేసిన కృషి గణిత ప్రపంచంలో చిర స్థాయిగా నిలిచిపోయింది.
రామానుజన్ యువతకు ప్రేరణ
శ్రీనివాస రామానుజన్ సాధారణ కుటుంబంలో జన్మించి, స్వీయ కృషితో ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తగా ఎదిగారు. సంఖ్యల సిద్ధాంతం, అనంత శ్రేణులు వంటి రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలు గణిత ప్రపంచానికి గొప్ప వరంగా మారాయి. ఆయన జీవితం విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. శ్రీనివాస రామానుజన్ జీవితం కష్టపడి నేర్చుకుంటే ఏ ఎత్తుకైనా ఎదగవచ్చని చూపిస్తుంది. ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం శ్రీనివాస రామానుజన్(Ramanujan) పుట్టిన రోజు అయిన డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.
Read Also: చంద్రుడిపై నాసా పర్మినెంట్ బేస్.. అప్పటిలోపే..!
Follow Us On: Instagram


