కలం, మెదక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో (Govt School) అడ్మిషన్ల కోసం పోటీ పడటం అరుదు. అయితే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జెడ్పీహెచ్‌ఎస్ (Narayankhed ZPHS) ఇందుకు భిన్నం. అడ్మిషన్ల కోసం కార్పొరేట్ స్కూళ్లను మించిన స్థాయిలో పోటీ నెలకొంది. పాఠశాలలు పునఃప్రారంభమైన మూడు రోజుల్లోనే అడ్మిషన్లు పూర్తయ్యాయి. దీంతో ‘నో అడ్మిషన్స్’ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల కంటే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల వైపు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండగా, ఈ పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
కొన్నేళ్లుగా పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, కొన్ని సందర్భాల్లో వాటిని మించి ఫలితాలు సాధిస్తున్నది. దీంతో సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో ‘నో అడ్మిషన్స్’ బోర్డు ఏర్పాటు చేయగా, ఈసారి పాఠశాలలు ప్రారంభమైన మూడు రోజులకే ప్రవేశాలు నిలిపివేయడం విశేషం.
835 మందికి చేరిన సంఖ్య
గత విద్యాసంవత్సరంలో పాఠశాలలో 800 మందికిపైగా విద్యార్థులు చదువుకున్నారు. ఇందులో 165 మంది పదో తరగతి పూర్తి చేసి వెళ్లిపోయారు. ఈసారి మూడు రోజుల్లోనే మరో 120 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 835కు చేరింది. చేరిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొన్ని తరగతులకు ఏ, బీ సెక్షన్లు ఏర్పాటు చేశారు. అయితే తరగతి గదులు, ఉపాధ్యాయుల సంఖ్య, మౌలిక వసతులు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్లు తీసుకోవడం సాధ్యం కాదని యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పదో తరగతి వరకు 13 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. 22 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 50 గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. పాఠశాల పదో తరగతి ఫలితాల్లో వరుసగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నది. పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏటా బాసర ట్రిపుల్ ఐటీతో పాటు పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘పీఎం శ్రీ’ పథకానికి కూడా పాఠశాల ఎంపికైంది.
అత్యాధునిక వసతులు
పాఠశాలలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. అలాగే విద్యార్థులకు పలు వృత్తి విద్యా (వొకేషనల్) కోర్సులు కూడా అందిస్తున్నారు. బ్యూటీషియన్ శిక్షణ, సంగీతం, సాహిత్య అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పీఎం శ్రీ పథకం కింద కొత్తగా ఐదు భవనాల నిర్మాణం కొనసాగుతున్నది. విద్యాబోధనతో పాటు క్రీడలు, యోగా, కరాటే తదితర అంశాల్లో కూడా శిక్షణ అందిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ జెడ్పీహెచ్‌ఎస్‌పై తల్లిదండ్రుల నమ్మకం పెరుగుతున్నది.
మంచి ఫలితాలు, ఆధునిక వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రశాంతమైన పాఠశాల వాతావరణం, వృత్తి విద్యా అవకాశాలు వంటి కారణాలతో తమ పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్‌లు, వొకేషనల్ కోర్సులు, క్రీడా శిక్షణ వంటి సౌకర్యాలతో ఈ పాఠశాల ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తున్నది.

