Mobile Popup Ad
Mobile Popup Ad

బాస‌ర జ్ఞాన సరస్వతి ఆల‌యంలో భారీ చోరీ!

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం (Basara Saraswathi Temple) పరిధిలోని మహంకాళి ఆలయంలో భారీ చోరీ జ‌రిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం పూజ‌లు, అభిషేకం చేసేందుకు వెళ్లిన అర్చకులు చోరీ జరిగిన విష‌యాన్ని గుర్తించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇద్ద‌రు దొంగ‌లు వ్యాస మ‌హ‌ర్షి ఆల‌యం వెనుక నుంచి మొద‌టి అంత‌స్తులో ఉన్న‌ మహంకాళీ ఆలయంలోకి చొర‌బ‌డ్డారు. ముఖాల‌కు గుడ్డ‌లు క‌ట్టుకొని, ఆల‌యంలో ఉన్న మూడు సీసీ కెమెరాల‌పై గుడ్డ‌లు క‌ప్పి ఈ చోరీ చేశారు. ఆల‌యం తలుపులు పగులగొట్టిన దుండగులు అమ్మవారి వెండి కిరీటం, హుండీని అపహరించారు. అయితే ముక్కు పుడ‌క‌, ఇత‌ర బంగారు ఆభ‌ర‌ణాలు అలాగే వ‌దిలివేయ‌డం గ‌మ‌నార్హం.

అర్ధ‌రాత్రి 12 గంట‌ల త‌ర్వాత ఈ చోరీ జ‌రిగింది. చోరీ జ‌రిగిన స‌మ‌యంలో రాత్రి డ్యూటీలో ఆరుగురు హోం గార్డులు ఉన్నారు. ఇంత సెక్యురిటీ మ‌ధ్య చోరీ జ‌ర‌గ‌డం తీవ్ర అనుమానాల‌కు తావిస్తోంది. అర్చ‌కుడు శ్రీను ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. వేద వ్యాస గుహ ద‌గ్గ‌ర గుట్ట‌ల్లో ఖాళీ హుండీ ల‌భ్య‌మైంది. దొంగ‌లు డ‌బ్బులు తీసుకొని ఖాళీ హుండీని అక్క‌డే ప‌డేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా ఘటన స్థలాన్ని సందర్శించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.

ప్రతి కోణంలో విచారణ చేపట్టి నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఆలయ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఎస్పీ వెంట భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్‌పెక్ట‌ర్లు రవీందర్ నాయక్, సమ్మయ్య, ఎస్సైలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆల‌యంలో (Basara Temple) చోరీ జ‌ర‌గ‌డంతో హుండీ లెక్కింపును ఈవో వాయిదా వేశారు. త్వ‌ర‌లో కొత్త తేదీ ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.

 

Read Also:  రమ్మంటున్న కేటీఆర్.. రానంటున్న కేసీఆర్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>