కలం, నిజామాబాద్ బ్యూరో: ఈ నెల 29, 30తేదీల్లో థాయిలాండ్ లోని బ్యాంకాక్‌లో జరుగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్డీజీ సినర్జీస్లో భారతదేశం తరపున నిజామాబాబ్ జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది మహ్మద్ జునైద్ అలీ ( Nizamabad Advocate Junaid Ali) ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సదస్సు ఐక్యరాజ్యసమితి ఈఎస్సిఎపి, డిఈఎస్ఎ ల సహకారంతో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. మహ్మద్ జునైద్ అలీ తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ఈ చర్చల్లో పంచుకోనున్నారు.
యుఎన్ ఈఎస్సిఎపి, యుఎన్ డిఈఎస్ఎ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ వేదిక, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎస్డిజి లను సాధించడానికి అవసరమైన వ్యూహాలపై దృష్టి సారిస్తుంది. మహ్మద్ జునైద్ అలీ గతంలో పలు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని, న్యాయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన ఎంపిక నిజామాబాద్ కు గర్వకారణమని, యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాద సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ జునైద్ అలీకి శుభాకాంక్షలు తెలిపారు.

