కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asian Games 2026) ప్రారంభానికి ముందే పాకిస్థాన్ క్రీడా రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తీవ్రమైన నిధుల కొరత, స్పోర్ట్స్ బోర్డు ఉదాసీనత వల్ల పాక్ అథ్లెట్ల సంఖ్య 123 నుంచి 80కి పడిపోయింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉందని సోమవారం నాటి ఒక నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి-నగోయాలో ఈ పోటీలు జరగనున్నాయి. అయితే నిధులు లేకపోవడంతో స్క్వాడ్ సైజ్ తగ్గించుకోవాలని లేదా సొంత ఖర్చులతో రావాలని పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు (పీఎస్బీ) పలు ఫెడరేషన్లకు తేల్చి చెప్పింది. పీఎస్బీ బడ్జెట్ 40 కోట్ల రూపాయల్లో.. దాదాపు 25 కోట్ల రూపాయలు ఒక్క హాకీ ఫెడరేషన్ కే కేటాయించడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన పీఎస్బీ డైరెక్టర్ జనరల్ యావర్ హుస్సేన్ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ కోత ప్రభావం బాక్సింగ్, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్ వంటి పతక ఆశలపై పడింది. అలాగే వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటలకు ఆర్థిక సహాయాన్ని బోర్డు పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో అథ్లెట్లు స్పాన్సర్ల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రికెట్ జట్టు ఖర్చులను మాత్రం పీసీబీ భరిస్తోంది. గతేడాది కేవలం మూడు పతకాలే గెలిచిన పాకిస్థాన్.. ఈ తాజా సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

