కలం, కరీంనగర్ బ్యూరో: నగరంలో పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే ధ్యేయంగా కరీంనగర్ నగరపాలక సంస్థ (Karimnagar Municipal Corporation) ఫుట్ పాత్ ఆక్రమణల పై ప్రత్యేక చర్యలు చేపట్టింది. కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలను తొలగించారు. టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఫుట్ పాత్ లు, రోడ్లపైకి వచ్చిన వ్యాపార దుకాణాలను వాటి బోర్డులను, తాత్కాలిక షెడ్లను, వ్యాపార సామగ్రిని తొలగించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి వెంకటేశ్వర టెంపుల్ రోడ్డుతో పాటు అమరవీరుల స్థూపం నుండి టవర్ సర్కిల్ మీదుగా రాజీవ్ చౌక్ తదితర టవర్ సర్కిల్ ప్రాంతం మొత్తం డ్రైవ్ చేపట్టి ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించారు.
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఫుట్ పాత్ లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమేనని, వాటిని ఆక్రమించి వ్యాపారాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు తరుచుగా ఫుట్ పాత్ లను ఆక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యాపారం చేస్తే మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్ ను నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వేణు, శ్రీధర్, ట్రాఫిక్ పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

